రూ.34 వేల కోట్ల రుణమాఫీ

25 Jun, 2017 02:16 IST|Sakshi
రూ.34 వేల కోట్ల రుణమాఫీ
- మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ ప్రకటన
89 లక్షల మంది రైతులకు లబ్ధి
 
సాక్షి, ముంబై: కరువు, పంటలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న మహారాష్ట్ర రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 34,020 కోట్ల భారీ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల 89 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ. 1.5 లక్షల వరకు ఉన్న రుణాలు రద్దు కానున్నాయి. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కృషి సమ్మాన్‌ యోజన’గా నామకరణం చేసిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ శనివారమిక్కడ ప్రకటించారు. పథకంతో 40 లక్షల మంది రైతులకు అప్పుల నుంచి పూర్తి విముక్తి, మరో 49 లక్షల మందికి కొంత ఉపశమనం కలగనుంది.

దేశంలో ఒక రాష్ట్రం ఇంత పెద్ద రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి అని ఫడ్నవిస్‌ తెలిపారు. దీని కోసం రాష్ట్రంలోని అధికార బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని అందిస్తారని వెల్లడించారు. ‘2012 నుంచి కరువుతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న రైతుల రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్‌ మేరకు కేబినెట్‌ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత వర్గాలు, పార్టీల నేతలు, రైతు బృందాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు. ‘రూ. 1.5 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తాం. 2012–16 మధ్య రుణాల్ని రీషెడ్యూల్‌ చేసుకుని.. 2016, జూన్‌ 30 నాటికి వాటిని చెల్లించని రైతులకు రూ. 25 వేలు లేదా రుణంలో 25 శాతం.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తం మేరకు రాయితీ ఉంటుంది’ అని తెలిపారు. కొత్తగా తీసుకునే రుణాల చెల్లింపు గడువును నిర్ణయించడానికి ఏపీ, తెలంగాణలో మాదిరి బ్యాంకులతో కలసి పనిచేస్తామన్నారు. రుణమాఫీపై రైతుల ఆందోళనతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిన సంగతి తెలిసిందే. 
మరిన్ని వార్తలు