సన్యాసి దర్శనం.. భౌతిక దూరం ఉల్లంఘన

13 May, 2020 13:30 IST|Sakshi

భోపాల్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే లాక్‌డౌన్‌ నిబంధనలు భౌతికదూరం పాటించటం, ముఖానికి మాస్క్‌లు ధరించడాన్ని పాటించకుండా యథేచ్చగా ప్రజలు గుమిగూడుతున్నారు. ఓ జైనమత సన్యాసిని దర్శించుకోవటం కోసం ఒక్కసారిగా ప్రజలు పెద్దఎత్తున అతని వద్దకు తరలివచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. జైనమత సన్యాసి దర్శనం కోసం కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రజలు పాటించకుండా ఉల్లంఘించారని సాగార్‌ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ భూరియా తెలిపారు. ఆ సన్యాసిని దర్శించుకునే కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. (‘రాజధాని’ స్టాప్‌లు పెంచండి: సీఎం)

సాగర్‌ జిల్లాలో ఇప్పటికే పది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. భౌతికదూరం పాటించకుండా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించటాన్ని నేరంగా పరిగణించాలని ఇటీవల హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం కొన్ని లాక్‌డౌన్‌ సడలింపు మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయటంపై ప్రజల నుంచి సలహాలు కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 24,386 కరోనా వైరస్‌ బాధితులు డిశ్చార్జ్‌ అవ్వగా, 2415 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 47,480 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు