కావేరీ ఇష్యూ: సుప్రీం కోర్టు సీరియస్‌

3 May, 2018 13:05 IST|Sakshi
కావేరీ నీటిలో నిరసనకారుల ప్రదర్శన.. పక్కన సుప్రీం కోర్టు(జత చేయబడిన చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ: కావేరీ జలాల వివాదంలో కర్ణాటక తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం పిటిషన్‌పై విచారణ జరిపింది. 

‘మే నెలకుగానూ కర్ణాటక ప్రభుత్వం నాలుగు టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో మార్గదర్శకాల రూపకల్పనలో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ కేంద్రాన్ని కోర్టు నిలదీసింది. దీనికి అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సమాధానమిస్తూ.. ‘ డ్రాఫ్ట్‌కు కేబినెట్‌ ఆమోదం లభించలేదు. ప్రస్తుతం ప్రధాని, మంత్రులు కర్ణాటకలో ఉన్నారు. ఎన్నికల హడావుడిలో ఉన్నారు. పైగా ఈ విషయంలో నిపుణుల నుంచి కాకుండా కర్ణాటక నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని కేంద్రం భావిస్తోంది. సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రుల నుంచి సలహాలు తీసుకోవాలని కేంద్రం యత్నిస్తోంది’ అని బదులిచ్చారు. మరో పది రోజుల గడువు ఇవ్వాలని కేంద్రం తరపున ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే అందుకు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అంగీకరించలేదు. ‘ఎన్నికలతో మాకు సంబంధం లేదు. తక్షణమే విధివిధానాలపై స్పష్టత ఇవ్వండి. రాష్ట్రాలకు ఈ వ్యవహారంలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణలో డ్రాఫ్ట్‌ వివరాలను సమర్పించండి’  అని సీజే.. అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం కావేరీ జలాలను రాజకీయం చేస్తోందని తమిళనాడు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు