దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో నేరం జరిగిందా?

18 Jan, 2020 02:08 IST|Sakshi

విచారణ కమిషన్‌కు సుప్రీంకోర్టు విధివిధానాలు

సాక్షి, న్యూఢిల్లీ: దిశ ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉదంతంలో ఏదైనా నేరం జరిగిందా.. అదే జరిగితే అందుకు బాధ్యులెవరో తేల్చాలని జస్టిస్‌ వీఎస్‌ సిర్పూర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌కు నిర్దేశించిన విధివిధానాల్లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపిన ఘటనపై సుప్రీంకోర్టు డిసెంబర్‌ 12న న్యాయవిచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిందితులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ జీఎస్‌ మణి, ప్రదీప్‌కుమార్‌యాదవ్, ఎంకే శర్మ, మనోహర్‌ లాల్‌ శర్మలు దాఖలు చేసిన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్‌ సిర్పూర్కర్‌ చైర్మన్‌గా, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్‌ బాల్డోట, సీబీఐ మాజీ డైరెక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా గల ఈ కమిషన్‌ 6 నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని ఆదేశించింది. తాజాగా జనవరి 10న తదుపరి విచారణకు రాగా జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని త్రిస భ్య ధర్మాసనం కమిషన్‌ విధివిధానాలు ఖరారు చేసింది. ‘దిశ నిందితులు అరెస్టై పోలీసుల కస్టడీలో మృతి చెందిన ఘట నపై, ఆ మృతికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరపాలి’అని నిర్దేశించింది.

>
మరిన్ని వార్తలు