ఆ ఆర్మీ అధికారులపై చర్యలు వద్దు: సుప్రీం

13 Feb, 2018 02:48 IST|Sakshi

న్యూఢిల్లీ: షోపియాన్‌ జిల్లాలో అల్లరిమూకలపై కాల్పులు జరిపిన ఘటనలో ఆర్మీ మేజర్‌ అదిత్య కుమార్‌ సహా ఇతర అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని జమ్మూకశ్మీర్‌ పోలీసుల్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

మేజర్‌ కుమార్‌ తండ్రి కల్నల్‌ కరమ్‌వీర్‌ సింగ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ పిటిషన్‌ వివరాలను అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కార్యాలయంతో పాటు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వంతో పంచుకోవాలని అత్యున్నత న్యాయస్థానం కల్నల్‌ సింగ్‌కు సూచించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ కేసులో సుప్రీంకోర్టు ముందస్తు అనుమతి లేకుండా పోలీసులు ఆర్మీ అధికారుల్ని అరెస్ట్‌ చేయడం కుదరదు.  

మరిన్ని వార్తలు