రాజీవ్‌ హత్య: గవర్నర్‌నే సాగనంపే యత్నం

4 Jan, 2020 09:13 IST|Sakshi

రాజీవ్‌ హంతకుల విడుదలపై ప్రతిష్టంభన

రీకాల్‌ పిటిషన్‌ కొట్టివేసిన మద్రాసు హైకోర్టు

సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకుల విడుదల కోసం ఏకంగా రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌నే సాగనంపే ప్రయత్నం న్యాయస్థానంలో బెడిసికొట్టింది. సదరు పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది.  రాజీవ్‌గాంధీ హత్యకేసులో నళిని, మురుగన్, పేరరివాళన్, రాబర్ట్‌పయాస్, జయకుమార్, శాంతన్, రవిచంద్రన్‌.. ఈ ఏడుగురు ఖైదీలు వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి తొలుత పడిన ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారింది. యావజ్జీవ ఖైదీలుగా 28 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. వారిని విడుదల చేయాలని కోరుతూ గతంలో కొందరు వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు సానుకూలంగా ఒకింత స్పందించింది. ఖైదీల విడుదల అంశంపై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ విచక్షణకు వదిలేసింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ పరిణామాలు చోటుచేసుకోగా వారి విడుదలకు అనుకూలంగా అసెంబ్లీలో ఆమె తీర్మానం చేశారు. సదరు ఫైల్‌ను సుమారు నాలుగేళ్ల  క్రితమే గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు.

రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు రాజీవ్‌ హంతకుల విడుదల కోసం పట్టుబట్టాయి. ప్రభుత్వ ఉదాసీనత వల్లే విడుదలలో జాప్యం చోటుచేసుకుందని ఆక్షేపించాయి. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సైతం 2018 సెప్టెంబర్‌ 9వ తేదీన అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి గవర్నర్‌ బంగ్లాకు పంపారు. ఈ దశలో రాజీవ్‌గాంధీతో పాటు మరణించిన వారి కుటుంబాల ఖైదీల విడుదలకు అభ్యంతరం తెలుపుతూ గవర్నర్‌కు వినతిపత్రాలు పంపారు. ఇది కేవలం రాజీవ్‌గాంధీ, ఖైదీల కుటుంబాలకు చెందిన అంశం కాదు ఇంటి పెద్ద మరణంతో తామంతా కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనే వాదన లేవనెత్తారు. ఈ దశలో గవర్నర్‌ న్యాయశాస్త్ర నిపుణులను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని చర్చించారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సంప్రదించారు. సుమారు రెండున్నరేళ్లపాటు గవర్నర్‌ అనేక విడతలుగా రాజీవ్‌ హంతకుల విడుదల అంశంపై సమీక్షలు జరిపారు. ఆ తరువాత నుంచి నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. రాజీవ్‌ హంతకుల విడుదలపై గవర్నర్‌ ఔనని..కాదని..ఏ విషయాన్ని ప్రకటించక పోవడంతో రెండేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది. ఏడుగురు ఖైదీల విడుదల విషయం దాదాపూ మూలపడిందనే చెప్పవచ్చు.
 
గవర్నర్‌ను రీకాల్‌ చేయాలంటూ పిటిషన్‌ 
అసెంబ్లీ మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన గవర్నర్‌ భన్వారీరాల్‌ రాజ్యాంగాన్ని ధిక్కరించినందున అతడిని రీకాల్‌ చేసేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చెన్నై కున్రత్తూరుకు చెందిన తందైపెరియార్‌ ద్రావిడ కళగం కాంచీపురం జిల్లా అధ్యక్షుడు కన్నదాసన్‌ ఇటీవల మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ వివరాలు.. ముఖ్యమంత్రి నియామకం మినహా ఇతర వ్యవహారాల్లో గవర్నర్‌ స్వతంత్య్రంగా వ్యవహరించేందుకు వీలులేదని రాజ్యాంగం 356 (1)లో పేర్కొని ఉంది. గతంలో బీజేపీ నేతగా, ఆర్‌ఎస్‌ఎస్‌ సానుభూతిపరునిగా ఉండిన భన్వారీలాల్‌.. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను వ్యతిరేకించే తమిళులపట్ల తన అయిష్టతను బహిరంగా చాటుకుంటున్నారు.

అందుకే మంత్రివర్గ తీర్మానంపై 15 నెలలుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజ్యాంగశాసనాలను ధిక్కరించే విధంగా భన్వారీలాల్‌ వ్యవహరిస్తున్నందున న్యాయస్థానం జోక్యం చేసుకుని గవర్నర్‌ బాధ్యతల నుంచి ఆయనను తప్పించేలా ఉత్తర్వులు జారీచేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ విచారణకు అర్హమైనది కాదని న్యాయమూర్తులు సత్యనారాయణన్, హేమలతతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మంత్రివర్గం చేసిన తీర్మానాలపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్‌కు గడవు అంటూ ఉండదని గతంలోనే కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. రాష్ట్రపతిచే నియమితులైన గవర్నర్‌ను పదవి నుంచి తొలగించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను ఆదేశించలేమని వివరిస్తూ సదరు పిటిషన్‌ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది.
 

మరిన్ని వార్తలు