ఒక్క మార్కు తగ్గిందని రివాల్యుయేషన్‌కి వెళితే..

9 Jun, 2018 16:11 IST|Sakshi
మహ్మద్‌ కైఫ్‌

బెళగావి: పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 625 మార్కులకు గాను 624 మార్కులు సాధించి మిగిలిన ఒక్క మార్కు కోసం రివాల్యుయేషన్‌కు వెళ్లి 100 శాతం మార్కులు సాధించాడు ఓ కర్ణాటక విద్యార్థి. బెళగావికి చెందిన మహ్మద్‌ కైఫ్‌ ముల్లా నగరంలోని ఓ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు.

ఇటీవల ఆ రాష్ట్ర పదో తరగతి బోర్డు ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో కైఫ్‌కు 625 మార్కులకు గాను 624 మార్కులు వచ్చాయి. సైన్స్‌ సబ్జెక్టులో ఒక్క మార్కు తక్కువగా వచ్చింది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలే రాసినా ఒక్క మార్క్‌ ఎలా పోయిందా? అని కైఫ్‌ అసంతృప్తి చెందాడు. 100 శాతం మార్కులు వస్తాయన్న ఆత్మవిశ్వాసంతో అతను రివాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశాడు.

అతను అనుకున్నదే నిజమైంది. రివాల్యుయేషన్‌లో కైఫ్‌కు ఆ ఒక్క మార్కు కూడా కలిసి వచ్చింది. దీంతో అతను 100 శాతం మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కైఫ్‌ మాట్లాడుతూ.. టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం ఆర్‌ఎల్‌ఎస్‌ అనే కాలేజీలో ఇంటర్మీడియేట్‌ చదువుతున్న కైఫ్‌ ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు