విడాకులపై సంచలన తీర్పు

12 Dec, 2016 14:37 IST|Sakshi
విడాకులపై సంచలన తీర్పు
ట్రిపుల్ తలాక్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. రాజ్యాంగపరంగా ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరూ ఆచరించాల్సిన అవసరం లేదని తెలిపింది. రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించేలా పర్సనల్ లాబోర్డు ఏదీ ఉండకూడదని హైకోర్టు తెలిపింది. ట్రిపుల్ తలాక్ అనేది మహిళల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, దానికి చట్టబద్ధత లేదని చెప్పింది. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారని, అందువల్ల దీన్ని పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. 
 
చాలాకాలంగా ట్రిపుల్ తలాక్ విధానం మీద ఎడతెగని వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మూడు సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం అనే ముస్లిం ఆచారం మీద పలు రకాల విమర్శలు, వివాదాలు ఉన్నాయి. కేవలం నోటిమాట ద్వారా విడాకులు ఇచ్చేస్తే మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. అయితే, ఇది తమ మతపరమైన ఆచారాలకు సంబంధించిన విషయమని, ఇందులో వేలు పెట్టడం సరికాదని ముస్లిం మతపెద్దలు వాదిస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఒక స్పష్టత వచ్చినట్లయింది. అయితే దీన్ని మళ్లీ సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. 
మరిన్ని వార్తలు