విగ్గు పౌడర్ విలవిల..

1 Mar, 2016 04:24 IST|Sakshi
విగ్గు పౌడర్ విలవిల..


బడ్జెట్ అంటే పన్నులు. మరి ఫన్నులు ఏమిటి? ఇవీ పన్నులే. అప్పుడెప్పుడో జనాల్ని చావబాదినవి. ఇప్పుడు మాత్రం మనకు విచిత్రంగా అనిపించేవి.. నవ్వు తెప్పించేవి.. వింతైనవి అన్నమాట. ఓసారి చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఆ ఫన్నులపై లుక్కేద్దామా..  
- సాక్షి సెంట్రల్ డెస్క్

విగ్గు పౌడర్ విలవిల..
బ్రిటిష్ ప్రధానుల్లోకెల్లా అత్యంత పిన్న వయస్కుడైన విలియమ్ పిట్ విచిత్రమైన పన్నులతో ప్రజలను విలవిలలాడించే వాడు. తన హయాంలో విగ్గులకు వాడే పౌడర్‌పైనా పన్ను విధించాడు. అప్పట్లో 1790 కాలంలో విగ్గులకు పౌడర్ వాడటం ఫ్యాషన్‌గా ఉండేది. అయితే, ఈ ఫ్యాషన్ 1820ల నాటికే కనుమరుగవడంతో, దానిపై విధించే పన్నుకూ కాలం చెల్లింది.

కిటికీ కిరికిరి..
రష్యా పాలకుడు పీటర్-1 కూడా వింత పన్నుల వీరుడే. చిమ్నీలపై పన్నులు విధించాలని తొలుత సంకల్పించాడు. అయితే, అదంత తేలిక కాకపోవడంతో పాటు చిమ్నీల కంటే కిటికీలను లెక్కించడం తేలిగ్గా కనిపించడంతో ఇళ్ల కిటికీలపై పన్ను వడ్డించాడు.

దూరంతో పెరిగే భారం..
దూరానికీ, పన్ను భారానికీ లంకెపెట్టిన చరిత్ర చైనాలోని చౌ వంశీయులది. వారి హయాంలో రాజధానికి చేరువలోనున్న పొలాలకు చెందిన రైతులపై 5 శాతం పన్ను విధించే వారు కాగా, దూరాన్ని బట్టి రైతులపై పన్ను భారం గరిష్టంగా 25 శాతం వరకు పడేది.

ప్రమాదాల పన్ను...
ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లకు న్యూజెర్సీ ప్రభుత్వం 1994 నుంచి పన్ను విధిస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి మూడేళ్ల వరకు ఏటా ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ద్వారా న్యూజెర్సీ సర్కారుకు అదనంగా 100 కోట్ల డాలర్లు సమకూరాయి.

మరిన్ని వార్తలు