గేట్‌ ర్యాంక్‌ హోల్డర్‌.. పకోడా వ్యాపారం

14 Jun, 2019 15:29 IST|Sakshi

డెహ్రడూన్‌ : గేట్‌ ఎగ్జామ్‌ ఎంత కష్టంగా ఉంటుందో ఇంజనీరింగ్‌ చదివే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గేట్‌ ర్యాంక్‌తో డైరెక్ట్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరే అవకాశం ఉండటంతో దానికి ఓ రేంజ్‌లో క్రేజ్‌ ఉంటుంది. దేశ వ్యాప్తంగా లక్షల మంది పోటీ పడే ఈ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్‌ సాధించడం కోసం విద్యార్థులు ఇంజనీరింగ్‌ మొదటి ఏడాది నుంచే కోచింగ్‌ వంటి వాటికి వెళ్తూ చాలా కష్టపడుతుంటారు. ఒక్క సారి గేట్‌లో ర్యాంక్‌ వచ్చిందంటే.. ఇక జీవితం సెటిల్‌ అయినట్లే అనుకుంటారు. అలాంటిది గేట్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ సాధించిన ఓ కుర్రాడు దాన్ని వదిలేసుకుని ప్రస్తుతం పకోడాలు అమ్ముతున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు.

వివరాలు.. సాగర్‌ షా అనే కుర్రాడు ఉత్తరాఖండ్‌లో ఇంజనీరింగ్‌ విద్య పూర్తి చేశాడు. తరువాత ఎంటెక్‌లో చేరడం కోసం గేట్‌ ఎగ్జామ్‌ రాశాడు. దానిలో అత్యుత్తమ ర్యాంక్‌ సాధించాడు. అయితే ఎంటెక్‌ పేరుతో మరో రెండేళ్లు కుటుంబానికి భారంగా మారకూడదని భావించాడు. దాంతో కుటుంబ వ్యాపారమైన పకోడి బిజినెస్‌లో చేరి తండ్రికి చేదోడు.. వాదోడుగా నిలుస్తున్నాడు. షాప్‌కు వచ్చే కస్టమర్లకు టీ, పకోడిలు సర్వ్‌ చేయడమే కాక ఏ మాత్రం మొహమాటపడకుండా పాత్రలను కూడా శుభ్రం చేస్తున్నాడు.

ఈ విషయం గురించి సాగర్‌ను ప్రశ్నించగా.. ‘ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక గేట్‌ ఎగ్జామ్‌ పాస్‌ అవ్వాలనేది నా కల. అందుకోసం ఎంతో శ్రమించాను. స్వంతంగానే చదువుకున్నాను. గేట్‌లో 8 వేల ర్యాంక్‌ సాధించాను. ఆ ర్యాంక్‌తో నాకు మంచి ఎన్‌ఐటీలోనే సీటు వస్తుంది. కానీ ఎంటెక్‌ పేరుతో మరో రెండేళ్ల సమయం వృధా చేయదల్చుకోలేదు. దాని బదులు ఏదో ఒక పని చేసి నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనుకున్నాను. అందుకే మా పకోడా వ్యాపారంలో భాగస్వామినయ్యాన’ని తెలిపారు. పకోడా షాప్‌ నడపడం కూడా ఓ సవాలే అన్నారు సాగర్‌. దీన్ని కూడా టెక్నాలజీతో అనుసంధానం చేసి మరింత స్మార్ట్‌గా ఈ బిజిసెస్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా కోరిక అని తెలిపాడు సాగర్‌.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు