బుల్లెట్‌ రైలుతో మనకు నష్టమా, లాభమా?

14 Sep, 2017 15:35 IST|Sakshi
బుల్లెట్‌ రైలుతో మనకు నష్టమా, లాభమా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును చేపట్టడం ద్వారా జపాన్‌కు లాభమా, భారత్‌కు లాభమా? లేదా ఇరు దేశాలకు ఇది లాభదాయకమా? ఎవరికి ఎక్కువ ప్రయోజనకరం? ‘షింకాన్‌సేన్‌’ బుల్లెట్‌ ట్రెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాకు విక్రయించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తూ విఫలమవుతున్న జపాన్‌ దేశం ఇప్పుడు భారత్‌లో ఈ కాంట్రాక్ట్‌ సాధించడం పట్ల ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. ప్రపంచంలో థాయ్‌లాండ్‌ తర్వాత ఈ బుల్లెట్‌ ట్రెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్న రెండవ దేశం భారత్‌ కావడం కూడా కొన్ని అనుమానాలకు కారణమవుతోంది. 
 
ఇరు దేశాల మధ్య కుదురిన ఈ ప్రాజెక్టు వివరాలను పూర్తిగా పరిశీలించినట్లయితే ఇరు దేశాలకు ఇది లాభదాయకమేనని తెలుస్తోంది. తరచు రైలు ప్రమాదాలు జరిగే భారత్‌ లాంటి దేశంలో బుల్లెట్‌ ట్రెయిన్‌లు ఇప్పుడు అవసరమా? అన్నది కొందరి నిపుణుల ప్రశ్న. పాత వ్యవస్థను మెరగుపర్చుకుంటూనే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పురోగతి సాధించడం తెలివైన పనని కొందరి విజ్ఞులు అభిప్రాయం. ముంబై నుంచి అహ్మదాబాద్‌ వరకు బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు అయ్యే 1700 కోట్ల డాలర్ల సొమ్ములో, 81 శాతం అంటే 1380 కోట్ల డాలర్లను జపానే ఆర్థిక సాయంగా అందిస్తోంది. అయితే అందుకు భారత్‌ చెల్లించాల్సిన వడ్డీ కూడా 0.2 శాతం మాత్రమే కావడం కూడా భారత్‌కు అనుకూలించే అంశం. 
 
కవసాకి హెవీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, ఇటాచి లిమిటెడ్, ఈస్ట్‌ జపాన్‌ రైల్వే లాంటి జపాన్‌ కంపెనీలు భారత్‌లో వ్యాపారాలు నిర్వహిస్తూ లాభాలు గడిస్తున్న నేపథ్యంలో ఇంత మొత్తాన్ని బుల్లెట్‌ రైలుకు రుణంగా అందించేందుకు జపాన్‌ ముందుకు వచ్చింది. పైగా సీమెన్స్‌ ఏజీ, బొంబార్డియర్‌ ఇన్‌కార్పొరేషన్, ఆల్‌స్టామ్‌ అండ్‌ లేట్లీ, సీఆర్‌ఆర్‌సీ లాంటి దిగ్గజ కంపెనీలతో పోటీపడి జపాన్‌ ఈ ప్రాజెక్టును సాధించడం సాధారణ విషయం కాదు. ముఖ్యంగా ప్రపంచంలోని పలు దేశాల్లో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులను చేపడుతున్న చైనా కంపెనీ సీఆర్‌ఆర్‌సీతో పోటీ పడి ప్రాజెక్ట్‌ను దక్కించుకోవడం కూడా విశేషమే. సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సాంకేతిక, వ్యాపార కారణాలతోపాటు ఆర్థిక, రాజకీయ కారణాలు కూడా ముడిపడి ఉంటాయి.
 
భారత్‌లో ఈ ప్రాజెక్ట్‌ను జపాన్‌ దక్కించుకోవడంలో కేవలం సాంకేతిక, వ్యాపార కారణాలే ఉన్నాయని భారతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘షింకాన్‌సేన్‌’ సాంకేతిక పరిజ్ఞానంతో జపాన్‌ గత యాభై ఏళ్లుగా బుల్లెట్‌ ట్రెయిన్‌లను నడుపుతున్నప్పటికీ ఇప్పటికీ ఒక్క ప్రమాదం కూడా జరకగ పోవడం విశేషం. ముంబై, అహ్మదాబాద్‌ నగరాల మధ్య నడిచే ఈ బుల్లెట్‌ రైలు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. భారత్‌లో మాత్రం దీన్ని వేగాన్ని 320 కిలోమీటర్లకు పరిమితం చేయనున్నారు. రెండు నగరాల మధ్య ఎనిమిది గంటల రైలు ప్రయాణం బుల్లెట్‌ రైలు వల్ల రెండు గంటలకు తగ్గుతుంది. ఎక్కువ దూరం పిల్లర్లపైన నిర్మించనున్న ఈ రైలుమార్గం 21 కిలోమీటర్లు మాత్రం భూగర్భంలో నుంచి వెళుతుంది. అందులో ఏడు కిలోమీటర్లు ఆరేబియా సముద్ర గర్భం నుంచి వెళుతుంది. 2023లో పూర్తికానున్న ఈ ప్రాజెక్ట్‌ ద్వారా భారతీయ రైల్వే వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. 
 

 

మరిన్ని వార్తలు