నీడలపై దాడి చేసిన నివేదిక

26 Aug, 2014 00:15 IST|Sakshi
నీడలపై దాడి చేసిన నివేదిక

కాంగ్రెస్  భజనపరులనువదుల్చుకోలేకపోతోంది. 2004 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే 25 రాజ్యసభ స్థానాలు ఇక్కడ నుంచి భర్తీ అయినాయి. కానీ వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ లేదా ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేకపోయారు. ఈ పరాన్నభుక్కులను వదుల్చుకుంటే పార్టీ మీద ఆశలు చిగురిస్తాయి.
 
ఈ లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి కారణాలను అన్వేషించవలసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏకే ఆంటోనీని కోరారు. ఆయన ఇచ్చిన నివేదిక పరమ గోప్యమైనది. అయినప్పటికీ, అడపాదడపా ఆంటోనీ ఇచ్చిన ప్రకటనలను బట్టి కొన్ని అంశాలు తెలిసిపోయాయి. పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ లను ఆంటోనీ బాధ్యులను చేస్తారని అంతా ఊహించారు. చరిత్రలో మున్నెన్నడూ లేని రీతిలో పార్టీ ఓడిపోవడానికి ఆ ముగ్గురే కారణం అయినప్పటికీ, ఆంటోనీ దీనిని ఎలాంటి శషభిషలూ లేకుండా వెల్లడిస్తారని  అనుకోవడం పిల్లచేష్టే అవుతుంది. లోపాలను అధ్యయనం చేసి, దిద్దుబాటుకు కూడా ఆయన సలహాలు ఇవ్వవలసి ఉంది. ఆయన ఎక్కడ వైఫల్యం ఉందో చెప్పారు గానీ, వాటికి బాధ్యులెవరో, వారి పేర్లను మాత్రం బాహాటంగా వెల్లడించలేదు. కానీ ఓటమికి ఆంటోనీ మూడు కారణాలను పేర్కొన్నారు. ఆ విధంగా ఆ ముగ్గురినీ ఒక విధంగా బాధ్యులను చేశారు.

సోనియా, మన్మోహన్, రాహుల్ తప్పిదాలు

మైనారిటీ వర్గాలవైపు మొగ్గుచూపి, కాంగ్రెస్ మెజారిటీ వర్గానికి (హిందువులు) వ్యతిరేకం అనిపించేటట్టు వ్యవహరించిందనీ, ఇది ఓటమికి కారణమనీ ఆంటోనీ బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఇందుకు పార్టీ అధిష్టానం, సలహాదారులే కారణమని అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ పరిస్థితి గురించి పార్టీ పెద్దలకు పూర్తిగా అర్థమైనా ఎవరూ పెదవి విప్పలేదని కూడా ఆంటోనీ పేర్కొన్నారు. సోనియాకు వీర విధేయుడుగా కనిపించే, సదా వార్తలలో ఉండే దిగ్విజయ్ సింగ్ కూడా ఆంటోనీ అభిప్రాయంతో ఏకీభవించారు. నిజానికి ఇక్కడ ఆంటోనీ సోని యానే పరోక్షంగా తప్పుపట్టారు. మైనారిటీల వైపు మొగ్గు చూపినట్టు కనిపిం చడం వల్ల పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆంటోనీ అన్నారు. ఇలాంటి విధానం అమలు చేసినవారు పార్టీ జాతీయ సలహా మండలి సభ్యులే. ఈ మండలి సోనియా అధ్యక్షతనే పనిచేసింది. మైనారిటీలు, కొన్ని కులాల పట్ల పార్టీ మొగ్గు చూపుతున్నదన్న అభిప్రాయం ప్రజలలో నెలకొన్న ఫలితమే, ‘పోటీ సమీకరణ’మని కూడా ఆంటోనీ విశ్లేషించారు. ఈ విధానం వల్ల ఓటు బ్యాంకు ఏర్పడుతుందని సోనియా భావించారే తప్ప, మెజారిటీ వర్గంలో కాంగ్రెస్ వ్యతిరేక భావనలు బలపడగలవని ఊహించలేక పోయారు. మైనారిటీ ఓటు బ్యాంకుల ఆలోచన వికటించి, కాంగ్రెస్ మట్టికొట్టుకుపోయింది. దేశంలో మొదటిసారి మైనారిటీ ఓటు బ్యాంకుల ఆలోచనకు పోటాపోటీగా ఓటు బ్యాంకుల ఏర్పాటు కార్యరూపం దాల్చింది.

మంచి పాలన ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆంటోనీ పేర్కొన్నప్పుడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, అవినీతి వంటి అంశాలను ప్రస్తావించారు.  ఓటమికి కారణం ‘ప్రభుత్వ వైఫల్యమే’నని ఆంటోనీ స్పష్టం చేశారు. ఈ వైఫల్యమే ప్రజలను ఆగ్రహానికి గురి చేసిందని కూడా ఆయన అంచనా వేశారు. తనతో సహా మొత్తం ప్రభుత్వం మంచి పాలన అందించడంలో విఫలమైందని ఆంటోనీ నిష్కర్షగా పేర్కొన్నారు.  కానీ, మన్మోహన్ పేరెత్తకుండా ఆంటోనీ యూపీఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం విశేషం.

 ఎన్నికల ప్రచారంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని ఆంటోనీ నిగ్గు తేల్చారు. అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ విశేషంగా చెమటోడ్చినా విజయం సాధ్యం కాలేదని అన్నారు. ఇది ఆ ఇద్దరి వైఫల్యాలను చూపడం తప్ప మరొకటి కాబోదు. మొత్తంగా చూస్తే, పార్టీ పరాజయానికి  మూడు అంశాలను ఆంటోనీ చూపారని అర్థమవుతుంది. అవి- మైనారిటీల వైపు మొగ్గు, మంచి పాలన ఇవ్వలేకపోవడం, ఎన్నికలలో దీటుగా ప్రచారం చేయలేకపోవడం.

ముగ్గురినీ తప్పుపట్టిన ఆంటోనీ

ఆంటోనీ నివేదికలో ఎలాంటి నిజాయితీ లేదని కొట్టిపారేయడం అన్యాయం. ఆంటోనీ ఒట్టి విధేయుడు కాదు. ఈ పదేళ్ల కాలంలో మన్మోహన్ సహా కాంగ్రెస్ నాయకులంతా రాహుల్ ప్రధాని పదవికి అర్హుడంటూ అనేక విధాలుగా పొగడ్తలలో ముంచెత్తారు. కాంగ్రెస్ శిబిరంలో ఒక్క ఆంటోనీయే అలాంటి భజన కార్యక్రమాన్ని చేపట్టలేదు. పార్టీ వైఫల్యానికి ఆయన మూడు అంశాలను గమనించి, అందుకు పరోక్షంగానే అయినా కారకులెవరో చూపగలిగారు. ఆ ముగ్గురు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని చెప్పగలిగారు. ఇతరులు కొన్ని వందల పేజీలలో తప్ప చెప్పలేని విషయాన్ని, ఆంటోనీ కాబట్టి కొన్ని పదాలతో చెప్పగలిగారు. రాహుల్‌నే తీసుకుందాం. సోనియా అనుసరించిన మైనారిటీ అనుకూల విధాన రూపకర్త ఆయన కాదు. అలాగే ప్రభుత్వాన్ని మన్మోహన్ నడిపారు గానీ, రాహుల్ కాదు. నాయకుడిగా రాహుల్‌కు ఉండే బలహీనతలు ఆయనకీ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వైఫల్యానికి గానీ, యూపీఏ ప్రభుత్వ తప్పిదాలకు గానీ ఆయన బాధ్యుడు కానేరడు. అయినా, ఈ తప్పిదంలో ఆయన భాగస్వామే. ఎందుకంటే, సోనియా, మన్మోహన్ చేస్తున్న తప్పిదాలను ఆయన నిరోధించలేకపోయారు.

అయితే భారతదేశంలో రాజకీయ పక్షాలు అంత సులభంగా కనుమరుగు కావు. కానీ కాంగ్రెస్ పార్టీ మనుగడకు సంబంధించిన గట్టి ప్రశ్నను ఎదుర్కొంటున్న మాట నిజమే. నరేంద్ర మోడీ చాలా భిన్నమైన నాయకుడనీ, మిగిలిన బీజేపీ నేతలకంటె ప్రత్యేకత ఉన్నవారనీ గమనించినప్పటి నుంచి ఆయనంటే గాంధీలు ఇద్దరూ గడగడలాడిపోతున్నారు. మోడీని ఢిల్లీ పీఠం దాకా నిరోధించాలని సోనియా గడచిన నాలుగేళ్లు శత విధాలా ప్రయత్నించారు. కాంగ్రెస్ పరివారం మొత్తం మోడీ మీదే తమ దృష్టిని సారించి దాడి చేసింది. అదంతా మోడీ ప్రతిష్టను పెంచిందే తప్ప, నిరోధించలేకపోయింది. అయితే మోడీ ఒకటి గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్‌పార్టీకి 44 స్థానాలు లభించాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మేజిక్ నంబర్ 272 సీట్లు అవసరం లేదు.

చిన్న ఆశ, అనేక సమస్యలు

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కొన్ని అవకాశాలు ఉన్నాయి. బీజేపీని మాత్రమే ఎదుర్కొనవలసిన రాష్ట్రాలు ఇంకా కొన్ని మిగిలాయి. బీజేపీ లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించినప్పటికీ చాలా రాష్ట్రాలలో ఆ పార్టీకి బలం లేదు. ఇవి లాభించేవే అయినా, కాంగ్రెస్‌కు ప్రతికూలాంశాలే ఎక్కువ. వంశపారంపర్య పాలనతో ప్రజలు రోతెత్తి ఉన్నారు. గడచిన పదేళ్లుగా పార్టీ ప్రదర్శించిన అహంభావ పూరిత వైఖరితో మధ్యతరగతి దూరమైంది. దీనికి తోడు ఆ పార్టీ దర్బారు సంస్కృతిని పెంచి పోషిస్తున్నది. గాంధీల కుటుంబాన్ని అంటకాగడమన్న ఒక్క లక్షణం తప్ప ప్రజలలో ఎలాంటి మద్దతు లేని నాయకులే రాజ్యసభ స్థానాలూ, ఇతర పదవులూ తన్నుకుపోతున్నారు. ఇంకా, పార్టీ నేతలు 1970 నాటి ఇందిర వ్యూహాలనే నమ్ముకుంటూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితమవుతూ, అవినీతి ఆరోపణలనీ, మధ్యతరగతినీ పట్టించుకోవడం లేదు. మోడీ మధ్య తరగతినీ, మధ్యతరగతిగా ఎదగాలన్న ఆకాంక్ష ఉన్న వర్గాలను ఆకర్షించారు. కానీ కాంగ్రెస్  భజనపరులను వదుల్చుకోలేకపోతోంది. 2004 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే 25 రాజ్యసభ స్థానాలు ఇక్కడ నుంచి భర్తీ అయినాయి. కానీ వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ లేదా ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేకపోయారు. ఈ పరాన్నభుక్కులను వదుల్చుకుంటే పార్టీ మీద ఆశలు చిగురిస్తాయి. ప్రజలలో ఏమాత్రం పలుకుబడి లేని జైరాం రమేశ్, మధుసూదన్ మిస్త్రీ, దిగ్విజయ్ సింగ్, సీపీ జోషీ వంటి నేతలనే సోనియా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆశ ఒక్కటే. నరేంద్ర మోడీ తప్పిదాలు చేస్తారు. దాని నుంచి లబ్ధి పొందవచ్చు. మోడీ కూడా ఎవరి మాటనూ లెక్క చేయకుండా తానొక సూపర్‌మ్యాన్ అని భావించుకుంటున్నారు. కానీ మోడీని నిరంతరం విమర్శిస్తూ ఆయన తప్పు చేయకుండా ఉండేలా మళ్లీ కాంగ్రెస్ పార్టీయే వ్యవహరిస్తోంది. చూద్దాం! ఎవరు నెగ్గుతారో?

 (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)  -  పెంటపాటి పుల్లారావు
 
 

మరిన్ని వార్తలు