దేశవ్యాప్త విస్తరణ దిశగా ‘ఆప్‌’

17 Feb, 2020 03:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) విస్తరణ బాట పట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కనీసం కోటి మందికి చేరువ అవ్వాలన్న లక్ష్యంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజా మంత్రివర్గంలో సభ్యుడిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌.. ఆప్‌ రాష్ట్రాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ‘మూడు విషయాలపై పని చేయాలని నిర్ణయించాం. మొదటిది, అన్ని రాష్ట్రాల పార్టీ యూనిట్లు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు రాష్ట్ర నిర్మాణ్‌ కార్యక్రమం చేపడ్తాయి.

ఇందులో పార్టీ వాలంటీర్లు ప్రజలను కలుస్తారు. కనీసం కోటి మందిని కలవాలనేది లక్ష్యం. అలాగే, దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు కలసిరావాలని కోరుతూ పోస్టర్లతో ప్రచారం చేస్తాం. ఇందుకు 9871010101 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని కోరుతాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోస్టర్లను అంటిస్తాం. ఆ తరువాత, అన్ని రాష్ట్రాల రాజధానులు, ఇతర ప్రధాన నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్‌మీట్లను నిర్వహిస్తారు. దేశ నిర్మాణంలో భాగంగా ఆప్‌లో చేరాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు’ అని గోపాల్‌ రాయ్‌ వివరించారు.

రానున్న నెలల్లో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నామన్నారు. తద్వారా, ఆయా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలను పొందాలనుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఏయే రాష్ట్రాల్లో పోటీకి దిగాలనేది పార్టీ నాయకత్వం త్వరలో నిర్ణయిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ‘ఆప్‌’ను ప్రాంతీయ పార్టీగానే ఎన్నికల సంఘం గుర్తించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్‌ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ, గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడంతో, జాతీయ స్థాయిలో సత్తా చూపాలన్న ఆ పార్టీ కోరిక నెరవేరలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అదీ పంజాబ్‌లోనే. ఢిల్లీలోని అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు