వీడియో : మద్యం-మనీ.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే

4 Dec, 2017 12:12 IST|Sakshi

కోయంబత్తూర్‌ : అధికార పార్టీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు మద్యం, డబ్బు పంచుతూ అడ్డంగా బుక్కయిపోయారు. ఆ వీడియో వైరల్‌ కావటంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఎంజీఆర్‌ జయంతి ఉత్సవాలను అన్నాడీఎంకే పార్టీ ఆదివారం ఘనంగా నిర్వహించింది. అయితే అందుకు జనాలను సమీకరించేందుకు ఎమ్మెల్యే ఆర్‌ కనకరాజ్‌ మద్యం, డబ్బును పంచారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు 60 బస్సుల్లో ఆయన ప్రజలను వేడుకలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే పక్కనే ఓ వ్యక్తి 2వేల రూపాయల నోట్ల కట్టలు పట్టుకుని రిజిస్టర్‌లో రాసుకుంటూ ఉండటం, ఆ పక్కనే మద్యం బాటిళ్ల కాటన్‌ డబ్బాల్లో ప్యాక్‌ చేసి ఉండటం కనిపించింది. దీనిపై ప్రతిపక్షాలు మాత్రం మరో వాదనను రేపుతున్నాయి. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ప్రలోభపెడుతున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నాయి.  

అయితే కనకరాజ్‌ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు. ఎంజీఆర్‌ జయంతి వేడుకల కోసం వేదిక వద్దకు వచ్చే కార్యకర్తల సౌకర్యార్థం తాను డబ్బును కేటాయించినట్లు ఆయన చెబుతున్నారు. తమిళ ప్రజలు డబ్బు, మద్యానికి తలొగ్గే రకం కాదని.. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలలో అన్నాడీఎంకే పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు.   

గతంలో ఆర్కే నగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. డబ్బు,మద్యం, మిల్క్ టోకెన్లు, చివరకు ఫోన్‌ రీఛార్జీ కూపన్లు, మొబైల్‌ వాలెట్ పేమెంట్లను కూడా పలువురు నేతలు పంపిణీ చేయటంతో ఎన్నిక రద్దైన విషయం తెలిసిందే. ఈ నెల 21న ఆర్కే నగర్‌ ఉప ఎన్నికను ఈసీ నిర్వహించనుంది.

మరిన్ని వార్తలు