శరద్‌ పవార్‌కు బీజేపీ భారీ ఆఫర్‌!

20 Nov, 2019 11:44 IST|Sakshi
శరద్‌ పవార్‌, ప్రధాని మోదీ (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ అనిశ్చితిపై ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమను ముప్పుతిప్పలు పెడుతున్న శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవుతోంది. ఇందులో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు గురించి ఇరువురు అగ్రనేతలు చర్చించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. పవార్‌కు బీజేపీ భారీ ఆఫర్‌ ఇచ్చిందని, దీంతో ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఆయన ముందుకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశంతో పాటు, పవార్‌కు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఆఫర్‌ చేసినట్లు శివసేన ఆరోపించింది. దీని గురించే నేరుగా ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆయనతో పవార్‌ భేటీ అవుతున్నారని మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఈ వార్తలను ఎన్సీపీ తోసిపుచ్చింది. మహారాష్ట్ర రైతు సమస్యలను ప్రధాని దృష్టి తీసుకెళ్లేందుకు పవార్‌ ఆయన దగ్గరకు వెళుతున్నారని ఎన్సీపీ నాయకులు చెబుతున్నారు. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానితో పవార్‌ సమావేశమవుతారు.

ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశాన్ని శరద్‌ పవార్‌ ఈ సాయంత్రానికి వాయిదా వేసుకున్నారు. బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అంగీకరిస్తారా, లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని ఇంతకుముందు పవార్‌ స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా, లేదన్నది త్వరలో తేలిపోనుంది. మరోవైపు ఢిల్లీలో పరిణామాలను కాంగ్రెస్‌ పార్టీ నిశితంగా గమనిస్తోంది. కాగా, మహారాష్ట్రలో తమ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని శివసేన విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. (చదవండి: అర్థం చేసుకోవడానికి 100 జన్మలు ఎత్తాలి)

>
మరిన్ని వార్తలు