కాంగ్రెస్, ఉగ్రవాదుల ఆలోచన ఒక్కటే!

24 Jun, 2018 02:39 IST|Sakshi

ఆజాద్, సోజ్‌ క్షమాపణ చెప్పాల్సిందే

జమ్మూ ర్యాలీలో అమిత్‌ షా

జమ్మూ: కాంగ్రెస్‌ నేతలు, ఉగ్రవాదులు ఒకే రకంగా ఆలోచిస్తున్నారని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా విమర్శించారు. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ జమ్మూ, కశ్మీర్‌లు విడిపోయేందుకు అంగీకరించదని స్పష్టం చేశారు. భద్రతా బలగాలను విమర్శిస్తూ.. ఇటీవల కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్, సైఫుద్దీన్‌ సోజ్‌లు చేసిన వ్యాఖ్యలపై షా తీవ్రంగా మండిపడ్డారు. జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని జమ్మూలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘సోజ్, మీరు వంద జన్మలెత్తినా.. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడదీయడాన్ని బీజేపీ ఒప్పుకోదు. జమ్మూ కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ తన జీవితాన్ని పణంగా పెట్టి ఈ రెండు ప్రాంతాలను కలిపారు. ఆయన ఆశయ సాధనే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.  

రాహుల్‌ వీరిని సమర్థిస్తారా?
భద్రతా బలగాలు కశ్మీర్‌లో.. ఉగ్రవాదుల కంటే సామాన్యులను ఎక్కువగా చంపేస్తున్నాయని ఆజాద్‌ ఆజాద్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ లష్కరే తోయిబా ప్రకటన చేయడంతో.. షా మండిపడ్డారు. ‘లష్కరే ఉగ్రవాదులు, కాంగ్రెస్‌ నేతల ఫ్రీక్వెన్సీ (ఆలోచన ధోరణి) సరిగ్గా సరిపోతోంది. ఆజాద్‌తోపాటు లష్కరే.. వ్యాఖ్యలను రాహుల్‌ ఖండిస్తారా?’ అని షా ప్రశ్నించారు. ఆజాద్, సోజ్‌లు దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్‌ ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు