వెనిజులాగా మారుతుందేమో అని భయమేస్తోంది: భట్టి

13 Dec, 2019 16:05 IST|Sakshi

కేసీఆర్‌కు నమస్తే పెడితే కార్పొరేషన్‌, కాళ్లు మొక్కితే కేబినేట్ ర్యాంకు పదవులు

సాక్షి, హైదరాబాద్‌:  కేసీఆర్‌ రెండోసారి అధికారం చేపట్టిన ఏడాదిలోనే తెలంగాణలో అల్లకల్లోలం నెలకొందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పాలనలో  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని అన్నారు. కేసీఆర్‌కు నమస్తే పెడితే కార్పొరేషన్‌ పదవులు, కాళ్లు మొక్కితే క్యాబినెట్‌ ర్యాంకు పదవులు వరిస్తాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పోకడతో రాష్ట్రం మరో వెనిజులాగా మారుతుందేమో అనే భయం కలుగుతోందన్నారు. 

సంవత్సర కాలంలో కేసీఆర్ పాలనలో.. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసిందని అందుకు కేసీఆర్ విధానాలే కారణమని భట్టి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని, శాంతి భద్రతలు నశించాయని.. సామాన్యులను పట్టించుకునే పరిస్థితి పోలీసు శాఖలో లేదని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి..కేవలం మంత్రులు, నాయకుల కోసమే పనిచేసేలా నియంత్రించారని విమర్శించారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రెవెన్యూ శాఖలో తీవ్ర గందరగోళం నెలకొందని భట్టి విక్రమార్క తప్పుపట్టారు.  దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. సగానికి పైగా రైతులకు రైతుబంధు అందని దుస్థితి ఏర్పడిందన్నారు. 

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ గందరగోళ ప్రకటనతో 30 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగ భృతి ఊసేలేదని మండిపడ్డారు. ప్రభుత్వం అసమర్థత కారణంగా చివరకు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని హేళన చేశారు. నిర్మాణంలో ఉన్న ఆన్-గోయింగ్ ప్రాజెక్టులను పక్కన పెట్టి .. రీ డిజైన్‌ పేరుతో అడ్డగోలు దోపిడీకి తెరతీశారని అన్నారు.

రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పడి.. అడ్డగోలుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం జ్వరాలమయం అయినా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా రాజకీయ ఫిరాయింపులు పెరిగిపోయాయని.. స్వయంగా సీఎం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేశారు. వ్యవసాయంపై ఏమాత్రం పట్టులేని పల్లా రాజేశ్వర్ రెడ్డికి.. ఎందుకు రైతు సమన్వయ చైర్మన్ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. పల్లా కార్పొరేట్ కళాశాలల్లో వ్యవసాయం చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు