ఆయనను అరెస్టు చేశారా? ఎక్కడా?

19 Dec, 2019 16:51 IST|Sakshi

గుహా అరెస్టుపై సీఎం యెడ్డియూరప్ప ఆశ్చర్యం

సాక్షి, బెంగళూరు/ న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడారు. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను ధిక్కరించి మరీ ఎర్రకోట వద్ద ఆందోళనకారులు గుమిగూడారు. ఇక్కడ ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రకోట వద్ద స్వరాజ్‌ అభియాన్‌ పార్టీ చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌తోసహా పలువుర్ని గురువారం ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని యోగేంద్ర ట్విటర్‌లో తెలిపారు. వామపక్ష నేతలు డీ రాజా, సీతారాం ఏచూరి, నిలోత్పల్‌ బసు, బృందా కరత్‌లను కూడా పోలీసులను అరెస్టు చేశారు.

ఇటు బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహాను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను పోలీసులు అరెస్టు చేయడంపై గుహా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. అయితే, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడంతోనే గుహాతోపాటు నిరసనకారుల్ని అరెస్టు చేశామని బెంగుళూరు సిటీ పోలీసులు తెలిపారు.

మరోవైపు గుహా అరెస్టుపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడ్డియూరప్ప ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుహా అరెస్టు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఎక్కడా? కారణం లేకుండా పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. నేను పోలీసులకు వెంటనే  ఆదేశాలు ఇస్తాను?’ అని యెడ్డియూరప్ప పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై, గూండాలపై చర్యలు తీసుకోవాలి కానీ, సామాన్య ప్రజలపై చర్యలు తీసుకోకూడదని, అలాంటిది ఏదైనా జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు.

మరిన్ని వార్తలు