నా పరువు, హక్కులకు భంగం కలిగించారు

20 Jun, 2018 03:34 IST|Sakshi

     యరపతినేని, కనకమేడలకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు

     పీఏసీ చైర్మన్‌ బుగ్గన

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తనపై అసంబద్ధ, నిరాధార, అసత్య ఆరోపణలు చేసి తన పరువు, హక్కులకు భంగం కలిగించారంటూ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, కర్నూలు జిల్లా డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఈ మేరకు ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ఈమెయిల్‌ ద్వారా నోటీసులు పంపారు. అనంతరం ఆయన కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

రెండు రోజుల క్రితం సదరు ఎంపీ, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఏపీకి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు, రికార్డులను రహస్యంగా కేంద్ర ప్రభుత్వానికి అందజేసి రాష్ట్రానికి ద్రోహం చేశారని ఆరోపించారు. దీనిపై బుగ్గన తీవ్రంగా స్పందించారు. ఎంపీ రవీంద్రకుమార్, ఎమ్మెల్యే శ్రీనివాసరావు తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి నిరూపిస్తే ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పదవులకు రాజీనామా చేస్తానని, నిరూపించలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామాలు చేయాలని బుగ్గన సవాల్‌ విసిరారు. స్పీకర్‌ స్పందించి ప్రివిలేజ్‌ కమిటీలో వారిపై చర్చించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు