ప్రియాంకకు యూపీ పగ్గాలు

14 Jul, 2019 18:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాష్ట్రాల వారీగా పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్‌ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇప్పటివరకూ తూర్పు యూపీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీకి కాంగ్రెస్‌ నాయకత్వం యూపీ పగ్గాలు అప్పగించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకువచ్చిన క్రమంలో యూపీలోని 80 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ కేవలం ఒక్క స్ధానాన్నే కైవసం చేసుకుంది. అప్పటి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సైతం అమేథిలో ఓటమి పాలయ్యారు.

యూపీఏ చీఫ్‌ సోనియా గాంధీ పోటీచేసిన రాయ్‌బరేలి స్ధానాన్ని మాత్రమే కాంగ్రెస్‌ దక్కించుకోగలిగింది. యూపీ పార్టీలో భారీ ప్రక్షాళనకు ప్రియాంక, పశ్చిమ యూపీ ఇన్‌ఛార్జ్‌ జ్యోతిరాదిత్య సింధియాల సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని పార్టీ కమిటీలన్నింటినీ హైకమాండ్‌ రద్దు చేసింది. యూపీలో 12 అసెంబ్లీ స్ధానాలకు ఉప ఎన్నికలు జరగనుండటంతో పార్టీని క్షేత్రస్దాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రియాంక గాంధీకి పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు