కింగ్‌మేకర్‌గా ఒకే ఒక్కడు..

25 Oct, 2019 10:39 IST|Sakshi

చండీగఢ్‌ : హరియాణాలో హంగ్‌ అసెంబ్లీ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి సభ్యుడూ కీలకంగా మారారు. గతంలో తాము రాజకీయంగా టార్గెట్‌ చేసిన వ్యక్తి హరియాణా లోక్‌హిత్‌ పార్టీని స్దాపించి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తానొక్కడే గెలుపొందడంతో కాషాయ నేతలు అతడిని తమ శిబిరంలోకి రప్పించేందుకు ప్రయత్నించారు. బీజేపీకి మద్దతు ప్రకటించి ఢిల్లీకి చేరిన స్వతంత్ర ఎమ్మెల్యేల బృందంలో ఆ వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్‌ కందా కూడా ఉన్నారు. హరియాణాలో ఐఏఎఫ్‌ విమానంలో గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే రంజీత్‌ సింగ్‌తో పాటు గోపాల్‌ కందా ఫోటో ఉండటం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

కాగా 2012లో తన ఏవియేషన్‌ కంపెనీలో పనిచేసే ఎయిర్‌ హోస్టెస్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన భూపీందర్‌ సింగ్‌ హుడా నేతృత్వంలోని కేబినెట్‌ నుంచి ఆయన వైదొలిగారు. గోపాల్‌ కందా వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఎయిర్‌హోస్టెస్‌ గీతికా శర్మ సూసైడ్‌ నోట్‌లో పేర్కొనడంతో ఆయనను అరెస్ట్‌ చేశారు.ఇక తొలుత షూ వ్యాపారంలో భారీ నష్టాలు రావడంతో 1998లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఆయన అడుగుపెట్టారు. 2007లో గోపాల్‌ తన కారులో నలుగురు నేరస్తులతో కలిసి పట్టుబడటంతో ఆయన దందాలపై దర్యాప్తు చేయాలని కేంద్రం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద ఎమ్మెల్యే, హర్యానా లోక్‌హిత్‌ పార్టీ తరపున ఏకైక​ సభ్యుడు గోపాల్‌ కందా గతంలో తనను రాజకీయంగా టార్గెట్‌ చేసిన బీజేపీకి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తుండటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు