మేనిఫెస్టో అదిరింది

18 Oct, 2018 05:20 IST|Sakshi

సీఎం కేసీఆర్‌తో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

అన్నివర్గాల్లో సంతృప్తి ఉందని వివరణ

మేనిఫెస్టోపై కేసీఆర్‌ ఆరా

ఇంకా అస్త్రాలున్నాయని భరోసా

పాక్షిక మేనిఫెస్టోతో టీఆర్‌ఎస్‌లో జోష్‌

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో విజయంపై తెలంగాణ రాష్ట్ర సమితిలో జోష్‌ పెరిగింది. పాక్షిక మేనిఫెస్టో ప్రకటనతో టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఒక్కసారిగా సానుకూల స్పందన పెరిగిందని టీఆర్‌ఎస్‌ అంచనాకు వచ్చింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నేతలు, వివిధ సంస్థలతోపాటు నిఘావర్గాలు ఇచ్చిన స్పందనలోనూ మేనిఫెస్టోపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని సమాచారం వచ్చింది. ముందస్తు ఎన్నికల్లో ముందున్న తమ పార్టీకి పాక్షిక మేనిఫెస్టోతో మరింత ఊపు వచ్చిందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. తెలంగాణ భవన్‌లో మంగళవారం సాయంత్రం పాక్షిక మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్‌ పలువురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడారు.

బుధవారం సైతం స్పందనలు తెలుసుకున్నారు. పాక్షిక మేనిఫెస్టోపై ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోందని ఆరా తీయగా బాగా అనుకూల స్పందన ఉందని అభ్యర్థులు వివరించారు. ‘రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులందరూ టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు. రుణమాఫీ మరోసారి చేస్తామనే హామీ గొప్ప నిర్ణయం. 42 లక్షలకు మరోసారి గొప్ప ఉపశమనం కలుగుతుంది. రైతుబంధు సాయాన్ని ఎకరాకు రూ.10 వేలకు పెంచడంతో మరింత మేలు జరుగుతుంది. రైతులు గ్రామాల నుంచి మాకు ఫోన్లు చేస్తున్నారు. కేసీఆర్‌కే మా మద్దతు అని చెబుతున్నారు. గ్రామాల్లో అద్భుత స్పందన ఉంది’అని పలువురు అభ్యర్థులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.

ఆసరా పింఛన్ల పెంపుతో అన్నివర్గాల్లోని ప్రజల్లో కేసీఆర్‌పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడిందని పలువురు వివరించారు. ఆసరా పింఛన్ల పెంపు ఉంటుందని ఆశించాం, అయితే, వయోపరిమితిని తగ్గించడం గొప్ప నిర్ణయం. 57 ఏళ్లు దాటినవారందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పడంతో ఆధారంలేని వారికి ఆసరా దొరికింది. కొత్త నిర్ణయంతో మరో ఎనిమిది లక్షల మందికి బతుకుపై భరోసా పెరుగుతుంది’అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పథకంపై ఎక్కువ చర్చ జరుగుతోందని ఆదిలాబాద్, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల అభ్యర్థులు వివరించారు. రూ.16 వేల కోట్లతో చేపట్టే ఈ పథకం విధివిధానాలు వెల్లడించాక ప్రజల్లో స్పందన మరింత పెరుగుతుందని చెప్పారు.  

భృతిపై యువతకు భరోసా...
టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కాకుండా నిఘా వర్గాలతో, ప్రైవేటు సంస్థలతోనూ పాక్షిక మేనిఫెస్టోపై ప్రజల స్పందనను సీఎం కేసీఆర్‌ తెలుసుకున్నారు. ఈ సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం నిరుద్యోగభృతి విషయంలో ఎక్కువమంది యువకులు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీని కచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకముందని, ఎక్కువమంది యువకులు దీనిపై సానుకూలంగా ఉన్నారని నివేదికలో తేలింది. నిరుద్యోగభృతి చెల్లింపు విషయంలో కేసీఆర్‌పై నమ్మకముందని టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి సమాచారమందింది. ప్రతి నెలా రూ.3,016 చొప్పున భృతి చెల్లింపు వల్ల నిరుద్యోగుల్లో మానసిక స్థైర్యం ఉంటుందని యువత అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు.

అన్ని జిల్లాల్లో హర్షం
టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై అన్ని జిల్లాల్లోని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పలు వర్గాలు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ప్రకటించినందుకు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ‘అగ్రవర్ణ పేదలను గుర్తించి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల నుంచి కోరుతున్నాం. అగ్రకులాల్లో పుట్టడం శాపం కాకూడదని సీఎం కేసీఆర్‌ గుర్తించి మాకు ఓ కార్పొరేషన్‌ ప్రకటించారు. తెలంగాణ ఆర్యవైశ్య భవన్‌ కోసం ఐదెకరాల భూమి ఇచ్చారు. ఆర్యవైశ్యులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా రెండు కార్పొరేషన్‌ చైర్మన్, మూడు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు, వివిధ కార్పొరేషన్లలో 84 డైరెక్టర్‌ పదవులను వైశ్యులకు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైశ్యులమంతా టీఆర్‌ఎస్‌ కే మద్దతుగా నిలుస్తాం’అన్నారు.

మరిన్ని వార్తలు