అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది: కె.లక్ష్మణ్‌

17 Aug, 2019 12:44 IST|Sakshi

సాక్షి, కరీనంగర్‌: ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లుగానే తెలంగాణ విమోచన దినోత్సవం జరిపి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ దినం.. కానీ సీఎం కేసీఆర్‌ దాన్ని తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. అసదుద్దీన్‌ వ్యాఖ్యలపై చర్యలు తప్పవన్నారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. గ్రానైట్‌, ఇసుక మాఫీయా సహజ సంపదను దోచేస్తుందని  ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు. ప్రాజెక్టుల్లో కమిషన్ల రూపంలో వచ్చిన అవినీతి డబ్బును ఎన్నికల్లో ఉపయోగించారన్నారు. పేదల సంక్షేమ పథకాలన్నింటిలోనూ అవినీతి జరిగిందని లక్ష్మణ్‌ ఆరోపించారు.

రూ.1500 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించలేక రాష్ట్రంలో వైద్య సేవలు నిలిపివేశారని లక్ష్మణ్‌ మండి పడ్డారు. సెక్రటేరియట్‌ కూల్చి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తామంటున్న ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం పట్టదా అని ప్రశ్నించారు. గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల గురించి పట్టించుకోని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ భవనాల కోసం మాత్రం ఎకరం రూ. 100కే అప్పనంగా అప్పగించారని ధ్వజమెత్తారు. 16 మంది సీఎంలు చేసిన అప్పులు రూ. 62 వేల కోట్లైతే.. కేసీఆర్‌ ఒక్కడే రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. ఎంసెట్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ తప్పుల తడకగా మారిందన్నారు. ఇంటర్‌ మార్కుల ప్రకటనలో జరిగిన అవకతవకల వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీని గురించి కేంద్రం వివరాలు అడిగితే.. కేసీఆర్‌ కుట్ర అంటున్నారని మండి పడ్డారు. గ్లోబరీనాపై చర్యలేందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

తెలంగాణలో బీజేపీనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం అని భావించి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారు లక్ష్మణ్‌. పరమత సహనం గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అన్న కేసీఆర్‌కు కరీంనగర్ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మోడీ బొమ్మ పెట్టాల్సి వస్తోందని ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదు. ఫసల్ బీమా, ఆవాస్ యోజన లాంటివి అమలు చేయడం లేదన్నారు లక్ష్మణ్‌. 

మరిన్ని వార్తలు