నేడే కమల్‌నాథ్‌ ప్రమాణం

17 Dec, 2018 04:16 IST|Sakshi
ఆదివారం భోపాల్‌లోని తన నివాసం వద్ద మద్దతుదారులతో కమల్‌నాథ్‌

15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌కు మళ్లీ కాంగ్రెస్‌ సీఎం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని జంబోరీ మైదానంలో ఈ వేడుక ఉంటుందనీ, ప్రమాణ స్వీకారానికి ముందు సర్వమత ప్రార్థనలు ఉంటాయని కాంగ్రెస్‌ నాయకురాలు శోభా ఓజా ఆదివారం చెప్పారు. కమల్‌నాథ్‌ ప్రమాణం చేశాక గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆ ప్రాంగణం నుంచి వెళ్లిపోతారనీ, అనంతరం కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారని శోభా చెప్పారు.

ఇతర మంత్రులెవరూ లేకుండా కమల్‌నాథ్‌ మాత్రమే సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్, హెచ్‌డీ దేవె గౌడ, కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి తదితరులు ప్రమాణ స్వీకార వేడుకకు రానున్నారని ఓజా చెప్పారు. ఇటీవలి మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. 15 వరుస సంవత్సరాల బీజేపీ పాలన తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటు కాబోతోంది.

వింధ్య ప్రాంతంలో ఓటింగ్‌ సరళిపై విచారణ
మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో కాంగ్రెస్‌కు అతి తక్కువ సీట్లు రావడంతో ఈ ప్రాంతంలోని ఓటింగ్‌ సరళిపై విచారణ జరిపించనున్నట్లు కమల్‌నా«ద్‌ తెలిపారు. ఇక్కడి ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 30 శాసనసభ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్‌కు కేవలం 6 సీట్లే దక్కాయి.

మరిన్ని వార్తలు