కర్ణాటక స్థానిక ఎన్నికలు.. కాంగ్రెస్‌ జోరు

3 Sep, 2018 10:49 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మూడురోజుల క్రితం నగర, పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉంది. తర్వాతి స్థానాల్లో బీజేపీ, జేడీ(ఎస్‌) ఉన్నాయి. కాంగ్రెస్‌ 46, బీజేపీ 36, జేడీ(ఎస్‌) 13 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. మిగతా స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. మొత్తం 2664 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 2218 వార్డుల ఫలితాలు ప్రకటించారు. కాంగ్రెస్‌ 846, బీజేపీ 788, జేడీ(ఎస్‌) 307, స్వతంత్రులు 277 స్థానాల్లో గెలుపొందారు. 

శివమొగ్గ, తుమకూరు, మైసూరు మహానగర పాలికెలతో పాటు 102 పట్టణ స్థానిక సంస్థలకు గత నెల 31వ తేదీన ఎన్నికలు జరిగాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈ ఫలితాలను దిక్సూచిగా అందరూ భావిస్తుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆయా అభ్యర్థుల గెలుపోటములపై మద్దతుదారులు భారీగా బెట్టింగ్‌లకు దిగుతున్నారు.

బెట్టింగుల జోరు...
మైసూరు, శివమొగ్గ, తుమకూరు మహానగర పాలికెల్లో ఎన్నికల బెట్టింగ్‌ విపరీతంగా నడుస్తోంది. ఈ మహానగర పాలికెల్లో కాంగ్రెస్, జేడీఎస్‌ అభ్యర్థుల మద్దతుదారుల మధ్య బెట్టింగ్‌ జోరు ఎక్కువగా కనిపిస్తోంది. శివమొగ్గలో బీజేపీ తరఫున ఎక్కువ మంది పందేలు ఒడ్డుతున్నారు. మైసూరులో జేడీఎస్‌ తరఫున, అలాగే తుమకూరులో కాంగ్రెస్, జేడీఎస్‌ల తరఫున సమానంగా బెట్టింగులు వేస్తున్నట్లు తెలిసింది. ఇక నగర సభ బెళగావి, బళ్లారి, బీదర్, చిత్రదుర్గ తదితర ప్రాంతాల్లో భారీగానే బెట్టింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే భారీ స్థాయిలో డబ్బులు, వాహనాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

 

ఫలితాలపై టెన్షన్‌  
ఇక ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. తాలుకా కేంద్రాల్లో నగర, పట్టణ స్థానిక సంస్థలకు, జిల్లా కేంద్రాల్లో మహానగర పాలికెల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 21 జిల్లాల్లో మొత్తం 2,634 వార్డులకుగాను బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 9,121 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. హంగ్‌ ఏర్పడితే పరస్పరం సహకరించుకుంటామని కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) ఇప్పటికే ప్రకటించాయి. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న ఈ రెండు పార్టీలు స్థానిక ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్, జేడీఎస్‌ పక్షం, బీజేపీ ఈ ఫలితాలను ప్రధాన అస్త్రంగా మలుచుకోనున్నాయి.

మరిన్ని వార్తలు