రైతును కాపాడుకుంటే రాష్ట్రాన్ని కాపాడుకున్నట్టే : కన్నబాబు

21 Jan, 2020 19:21 IST|Sakshi

సాక్షి, అమరావతి : రైతు భరోసా కేంద్రాలతో చాలా ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు తెలిపారు. రైతును కాపాడుకుంటే రాష్ట్రాన్ని కాపాడుకున్నట్లేనని అన్నారు. రైతుబంధు పథకంపై కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభించారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధునాతన వ్యవసాయ పద్ధతులను.. వర్క్‌షాప్‌లో అందించే కార్యక్రమం చేస్తామన్నారు. టెక్నాలజీని అనుసంధానం చేసి రైతులకు మెరుగైన సాయం చేస్తామని పేర్కొన్నారు. రైతుకు అవసరమైన విద్యను అందించేలా లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

ప్రతి జిల్లాలో 5 హబ్స్‌ పెడతామని.. మొత్తం మెటీరియల్‌ను ఉంచుతామని తెలిపారు. రైతు పంటకు సంబంధించిన ఆర్డర్‌ ఇచ్చిన వెంటన.. డెలివరీ చేసే బాధ్యత రైతు భరోసా కేంద్రం తీసుకుంటుందన్నారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ నిరంతరం కృషి​ చేస్తున్నారని తెలిపారు. ఇంతకు ముందు రైతుకు గిట్టుబాట ధర వస్తుందో లేదో తెలియకపోయేదని.. కానీ ఇప్పుడు రైతు పంట వేసే ముందే ప్రభుత్వం గిట్టుబాట ధర ప్రకటిస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. గత చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీని కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు. 

ఈ-క్రాప్‌ బుకింగ్‌ను తప్పనిసరి చేశామని.. దీంతో రైతు ఏ పంట వేశాడో తెలుస్తుందని కన్నబాబు చెప్పారు. రైతుబంధు ద్వారా నేరుగా రైతులకు సాయం చేశామన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి అందించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. ఏ పథకమైనా సరే పకడ్బంధీగా అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారని తెలిపారు. రైతుకు ఏ సమస్య వచ్చినా.. ఆన్‌లైన్‌లో శాస్త్రవేత్తలతో సూచనలు ఇప్పిస్తామని తెలిపారు. కన్నబాబు మాట్లాడిన అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం శాసనసభను రేపటికి వాయిదా వేశారు. ఈ అంశంపై బుధవారం చర్చ జరుగుతుందన్నారు. 

మరిన్ని వార్తలు