పథకం ప్రకారమే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం!

25 Oct, 2018 17:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం పలు అనుమానాలకు దారితీస్తోంది. పక్కా పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లుగా కనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌ రాకపోకలపై పూర్తి సమచారం సేకరించి ప్లాన్‌ ప్రకారమే దుండగులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చేరుకునేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో వైఎస్‌ జగన్‌ ఎదురుచూస్తుండగా దాడి జరిగింది. అక్కడి కేఫ్‌టేరియలో పనిచేసే వెయిటర్‌ శ్రీనివాస్‌ సెల్ఫీ నెపంతో వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చి.. కత్తితో మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వైఎస్‌ జగన్‌ తప్పించుకోవడంతో ఆయన భుజానికి తీవ్రగాయమైంది.

ఈ దాడిలో పైకి శ్రీనివాస్‌ కనిపిస్తున్నా.. తెరవెనుక మరికొంత మంది ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. గత రెండు నెలలుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి జగన్ వస్తున్న సంగతిని కుట్రదారులు గమనించినట్లు తెలుస్తోంది. ప్రతి గురువారం వైఎస్‌ జగన్‌ ప్రయాణ సమాచారాన్ని తెలుసుకున్న కుట్రదారులు ఎయిర్‌ పోర్టు లాంజ్‌ అయితేనే తమ పని సులువవుతుందని అనుకున్నారు. అక్కడ భద్రత తక్కువ ఉంటుందని భావించి వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేఫ్‌టేరియా సిబ్బంది రూపంలో అయితే జగన్‌కు దగ్గరగా వెళ్లొచ్చని కుట్ర పన్నారు.

కేఫ్‌టేరియా సిబ్బంది రూపంలో శ్రీనివాస్‌ను ఎయిర్‌పోర్టులోకి పంపిచారు. కత్తిని వారం ముందే ఎయిర్‌పోర్ట్‌లోకి తీసుకెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. సైజ్‌ చిన్నదైనా.. పదునుగా ఉంటే కోడిపందాల కత్తిని ఉపయోగించారు. సరైన సమయం కోసం వేచిచూసిన శ్రీనివాస్‌ గురువారం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్‌ కత్తి పట్టుకున్న తీరు పక్కా ప్రొఫెషనల్‌ కిల్లర్‌ తీరును తలపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యాయత్నం జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

టీడీపీ నేతకు నిందితుడు సన్నిహితుడు..
వైఎస్‌ జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాస్‌ది అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం అని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ల్యాంజ్‌ క్యాంటీన్‌ యాజమాని హర్షవర్ధన్‌కు అతడు సన్నిహతుడని సమాచారం. హర్షవర్థన్‌ అధికార టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. అతడు గతంలో గాజువాక టీడీపీ టిక్కెట్‌ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ పెద్దల సిఫార్సుతోనే అతనికి ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌ కాంట్రాక్ట్‌ వచ్చింది. అతడి క్యాంటీన్‌లోనే పనిచేస్తున్న శ్రీనివాస్‌ భద్రత తనిఖీల కళ్లుగప్పి కత్తిని ఎలా లోపలికి తీసుకొచ్చాడన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప ఈ ఘటనకు వెనక ప్రేరేపణ ఏమిటి? కుట్ర ఏమిటి? అన్నది తెలియదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం!

మరిన్ని వార్తలు