ఏపీని టీడీపీ భ్రష్టు పట్టించింది

1 Mar, 2019 02:37 IST|Sakshi

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని పెడితే.. ఇప్పుడదే పార్టీతో జతకలిసింది

కాంగ్రెస్, టీడీపీలపై ఆంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు

ఒకరు రాష్ట్రాన్ని విభజిస్తే, మరొకరు భ్రష్టు పట్టించారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజం

ఏపీ ప్రజలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్య

‘మేరా బూత్‌ సబ్‌సే మజ్‌బూత్‌’లో భాగంగా కార్యకర్తలతో సంభాషణ

సాక్షి, న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అధికార తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ఆంధ్ర ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజిస్తే, మరో పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. మోదీ గురువారం ఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని కార్యకర్తలతో ‘మేరా బూత్‌ సబ్‌సే మజ్‌బూత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణాదిలో బీజేపీ గెలుపు అవకాశాలపై తమిళనాడు నుంచి పార్టీ కార్యకర్త ఒకరు అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానమిచ్చారు. ‘‘దక్షిణ భారతంలో బీజేపీ ఎన్నడూ అధికారాన్ని చేపట్టలేదు.

కానీ 2008లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2018లో ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌లతో ప్రజలు విసిగిపోయారు. మంత్రి పదవుల విషయంలో రెండు పార్టీలూ ఎల్లప్పుడూ విభేదించుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలకు కర్ణాటక ప్రజల మద్దతు లేదు. ఇక తమిళనాడులో మంచి కూటమి ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ మంచి ఫలితాలు సాధిస్తాం. కేరళ విషయానికి వస్తే.. ఆ రాష్ట్ర సంస్కృతిని రక్షించుకునేందుకు ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. తెలంగాణలో కూడా బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుంది’’ అని చెప్పారు.  

కాంగ్రెస్‌ పార్టీ కాళ్లమీద పడుతున్న టీడీపీ
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను మోదీ ప్రస్తావిస్తూ.. ఏపీలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అవమానించిన కాంగ్రెస్‌ పార్టీ కాళ్లమీద టీడీపీ పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్‌ టీడీపీని నెలకొల్పితే.. ఇప్పుడదే కాంగ్రెస్‌ పార్టీతో తెలుగుదేశం జతకట్టిందని దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్, టీడీపీలపై ఆంధ్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఒకరు రాష్ట్రాన్ని విడదీస్తే, మరొకరు భ్రష్టుపట్టించారు. వీరికి కుటుంబం సంక్షేమం తప్ప ప్రజా సంక్షేమం పట్టదు.

ఆంధ్ర ప్రజలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 130 కోట్ల మంది భారతీయుల అభివృద్ధికి సమాన కృషి చేసిందని, అభివృద్ధిని కాంక్షించే ప్రజలు ఎల్లప్పుడూ బీజేపీ వైపే ఉంటారని, ఈ క్రమంలో దక్షిణ భారతంలో ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ‘మేరా బూత్‌ సబ్‌సే మజ్‌బూత్‌’ పేరిట నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు