ఉప ఎన్నికల్లో కమలానికి షాక్‌

31 May, 2018 09:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉప ఎన్నికల ఫలితాల్లో  భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి ప్రభావం చూపకపోగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఓటమితో భంగపడింది. మూడు సిట్టింగ్‌ స్థానాల్లో ఒక్క స్థానం మాత్రమే నిలుపుకోగలిగింది. పాల్ఘడ్‌(మహారాష్ట్ర)లో శివసేన అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. భండారా-గోండియా స్థానాల్లో(మహారాష్ట్ర)లో ఎన్సీపీ ఘనవిజయం సాధించింది.

ఇక కైరానా(యూపీ) లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ 55 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ పోటీదారు మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఇక్కడ విపక్షాలన్నీ(ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) కలిసి ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ను నిలబెట్టాయి. నాగాలాండ్‌ సొలె లోక్‌సభ స్థానం ఫలితాల్లో ఎన్డీపీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 28 తేదీన నాలుగు లోక్‌ సభ స్థానాలకు, 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కాగా, కాసేపట్లో తుది ఫలితాలు తేలనున్నాయి.

అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే... కర్ణాటక ఆర్‌ఆర్‌ నగర్‌(రాజరాజేశ్వరి నగర్‌) స్థానంలో, పాలస్‌ కడేగావ్‌-మహారాష్ట్రలో, అంపతి-మేఘాలయలలో కాంగ్రెస్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. పంజాబ్‌లోని షాకోట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అకాలీదల్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. షాకోట్‌ అకాలీదల్‌ సిట్టింగ్‌ స్థానం. ఉత్తర ప్రదేశ్‌లోని నూర్పూర్‌(అసెంబ్లీ స్థానం)లో బీజేపీకి షాక్‌ తగిలింది. బీజేపీ సిట్టింగ్‌ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. మహేస్తల-పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అభ్యర్థి విజయం దాదాపు ఖరారైంది. చెంగన్నూర్‌-కేరళలో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. జోకిహట్‌(బిహార్‌)లో జేడీయూకు ఘోర పరాభవం ఎదురైంది. ఆర్జేడీ పార్టీ అభ్యర్థి విజయం సాధించటంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆర్జేడీ నేతలు, దీనిని విపక్షాల సమిష్టి విజయంగా అభివర్ణించారు. జార్ఖండ్‌లోని గోమియా స్థానంలో బీజేపీ అభ్యర్థి, సిలీ స్థానంలో జేఎంఎం అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఉత్తరాఖండ్‌ థరేలీలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

కాగా,  మూడు రోజుల(సోమవారం) క్రితం మూడు రాష్ట్రాల్లోని 4 లోకసభ స్థానాలకు, 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్ కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘడ్‌, భండారా-గోండియా, నాగాలాండ్‌లోని సోలె లోక్‌సభ స్థానాలకు,  దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు(నూర్పూర్‌-యూపీ, షాకోట్‌-పంజాబ్‌, జోకిహట్‌-బిహార్‌, గోమియా, సిలీ-జార్ఖండ్‌, చెంగన్నూర్‌-కేరళ, పాలస్‌ కడేగావ్‌-మహారాష్ట్ర, అంపతి-మేఘాలయ, థరేలీ-ఉత్తరాఖండ్‌, మహేస్తల-పశ్చిమ బెంగాల్‌, రాజరాజేశ్వరి నగర్‌(ఆర్‌ఆర్‌ నగర్‌)-కర్ణాటక స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పాలక, ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

మరిన్ని వార్తలు