ఒక్కరోజు.. 11 వాయిదాలు!

5 Apr, 2018 02:44 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభ కొత్త రికార్డు సృష్టించింది. నిరసనలతోపాటు అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా బుధవారం ఒక్కరోజే 11 సార్లు వాయిదా పడింది. అవినీతి నిరోధక (సవరణ) బిల్లు–2013పై చర్చ విషయంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య వివాదంతో రికార్డు స్థాయిలో వాయిదాల పర్వం కొనసాగింది. విపక్షాల తీరుపై  రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయం 11గంటలకు సమావేశమైన రాజ్యసభ 20 నిమిషాలకే వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైనా.. సభలో నిరసనలు కొనసాగటంతో మూడు గంటల వ్యవధిలోనే మరో 10 సార్లు వాయిదా పడింది. దేశ ప్రయోజనంతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని.. అయితే ప్రభుత్వమే చర్చ జరగకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్‌ పక్షనేత గులాంనబీ ఆజాద్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు