మోదీని విమర్శించే సత్తా ఒక్క ఆమెదే!

5 Jun, 2018 14:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇతర వెనకబడిన వర్గాల వారిని వెనకబడిన వారు, ఎక్కువ వెనకబడిన వారని, షెడ్యూల్డ్‌ కులాల వారిని దళితులు, అతి దళితులని విభజించడం నాకు ఇష్టం లేదు. మనల్ని విభజించడం ద్వారా ఓట్లు వస్తాయని వారు భావిస్తారు. ఇదీ విభజించు, పాలించు విధానమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన పాలకులు చేస్తున్నది ఇదే. మనల్ని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కలిపితే వీరు విడదీస్తున్నారు’ అంటూ ఓ బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇతర వెనకబడిన వర్గాలను ఉప కేటగిరీలుగా విభజించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 27వ తేదీన చేసిన వ్యాఖ్యలను ఇది సమూలంగా వ్యతిరేకించడమే, సంపూర్ణంగా విమర్శించడమే!

ఆమె మరెవరో కాదు, సాధ్వీ సావిత్రి భాయ్‌ ఫూలే. ఆమె, ప్రజల అభివృద్ధి ఏమాత్రం పట్టించు కోకుండా శతాబ్దాల క్రితం మసీదులుగా మారిన దేవాలయాలను పునరుద్ధరించాలంటూ కషాయం కక్కే సాధ్వీ రితంబర, ఉమా భారతిల కోవకు చెందిన వారు కానేకాదు. వారిలాగా కాషాయం దుస్తులు ధరిస్తారు అంతే! అమె తన ఢిల్లీలోని ఉత్తర అవెన్యూలోని 65 నెంబర్‌ ఇంటి డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చొని అణు క్షణం బహుజనుల (దళితులు, మైనారిటీలు, ఓబీసీలు) అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. వారి నుంచి వచ్చే పిటిషన్లను తీసికోవడం, వాటి గురించి వారితో చర్చించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు.

ప్రధాని నరేంద్ర మోదీ పేరును సావిత్రి భాయ్‌ ఫూలే నేరుగా ప్రస్థావించకపోవచ్చుగానీ సమయం వచ్చినప్పుడల్లా మోదీ విధానాలను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టాన్ని గత మార్చి నెలలో సుప్రీం కోర్టు సడలించినప్పటి నుంచి రోజూ ఏదో రూపంలో సాధ్వీ పేరు వినిపిస్తూనే ఉంది. సుప్రీం కోర్టు తీర్పును వెనక్కి తీసుకునేలా చేయాలని ఆమె కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ రెండవ తేదీన భారత్‌ బంద్‌ నిర్వహించిన దళితులను జైల్లో పెట్టడాన్ని కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు. దళితులకు తమ హక్కుల కోసం పోరాడే నైతిక స్థైర్యం ఉండకూడదనే ఉద్దేశంతోనే వారిని అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ల విధానాన్ని తిరిగి రాయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. నకిలీ సర్టిఫికెట్లతో దళితేతరులు ఉద్యోగాలు పొందుతున్న రిజర్వేషన్‌ విధానాన్ని సమీక్షించాల్సిందేనంటూ డిమాండ్‌ చేశారు.

దళితులను పిలిచి మీ ఇళ్లలోనే భోజనాలు పెట్టండి!
నరేంద్ర మోదీ ఆదేశం మేరకు దళితుల ఇళ్లలో భోజనం చేసిన బీజేపీ ఎంపీలను కూడా ఆమె ఎండగట్టారు.‘దళితుల ఇళ్లలో వండిన భోజన పదార్థాలను వాళ్లు తినలేదు. వారు కనీసం మన పాత్రలను ఉపయోగించలేదు. మన గ్లాసుల్లో నీళ్లు తాగలేదు. మన ఇళ్ల బయట దళితేతరుల వంటకాలను వాళ్లు భుజించారు. దీన్నిబట్టి దళితులు అంటరాని వారన్న ఆలోచన వారి నుంచి పోలేదన్నది స్పష్టం అవుతోంది. వారు దళితుల ఇళ్లలో ‘ఇలా’ భోజనం చేసినప్పుడు ఫొటోలు దిగుతారు. అవి వివిధ మీడియాల్లో వైరల్‌ అవుతాయి. వారు ఇతర కులాలతో కలసి భోజనం చేసినప్పుడు వారు ఇలా ఫొటోలు ఎందుకు దిగరు? వాటికంత ప్రాధాన్యత లేదా?’ అంటూ ఇంతకాలం దళితుల ఇండ్లలో రాజకీయ నాయకుల భోజనాలు అంటు జరుగున్న నాటకాన్ని ఆమె చాలా తెలివిగా బట్టబయలు చేశారు. ‘ఇక నుంచి దళితుల ఇళ్లకెళ్లి భోజనాలు చేయడం కాదు, వారిని తమ ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టండి’ అంటూ బీజేపీ ఎంపీలు సహా రాజకీయ నాయకులందరికి సాధ్వీ సరికొత్త సవాల్‌ విసిరారు. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్‌ నెలలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని దుండగులను ధ్వంసం చేసినప్పుడు ఆమె ధర్నా చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ను కలుసుకొని దోషులను అరెస్ట్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. నేటికి కూడా వారిని అరెస్ట్‌ చేయలేదంటూ ముఖ్యమంత్రిని విమర్శించారు.

అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీలో మొహమ్మద్‌ అలీ జిన్నా ఫొటో ఉండడాన్ని హిందూ సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు సాధ్వీ అంతే తీవ్రంగా వారిని వ్యతిరేకించారు. ఇతర స్వాతంత్య్ర యోధుల్లాగా జిన్నా కూడా దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం జరిపారని, అలాంటి వ్యక్తి ఫొటో యూనివర్శిటీలో ఉంటే తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. పలువురు బీజేపీ ఎంపీలకు తమ కుటుంబాల బాగోగులు చూసుకోవడానికే సమయం చాలడం లేదని ఓ సందర్భంలో ఆమె విమర్శించారు.

అంత ధైర్యం ఎలా వచ్చింది?
అటు మోదీ విధానాలకు వ్యతిరేకంగాగానీ, ఇటు బీజేపీ ఎంపీలకు వ్యతిరేకంగానీ నిర్మొహమాటంగా మాట్లాడే ధైర్యం ఆమెకు ఎలా వచ్చింది? ఇందుకు ఆమె పుట్టి పెరిగిన వాతావరణంగానీ, దళితుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నానంటూ ఆమె చేసిన ప్రతిజ్ఞ వల్లగానీ వచ్చి ఉంటుంది. ఆమెనే పలు సందర్భాల్లో వెల్లడించిన విషయాల మేరకు సాధ్వీకి ఆరవ ఏటనే పెళ్లయింది. తనకు మొగుడు వద్దని, చదుకుంటానని పంతం పట్టింది. ఎనిమిదవ తరగతి ఫస్ట్‌క్లాస్‌లో పాసయింది. ఎస్సీ విద్యార్థులకిచ్చే స్కాలర్‌షిప్‌ను తనుకూ ఇవ్వాలని ఆమె తన ప్రిన్సిపాల్‌ను డిమాండ్‌ చేసింది. అందుకు నిరాకరించిన ప్రిన్సిపల్‌ తాను సరిగ్గా బోధించడం వల్లనే ఫస్ట్‌క్లాస్‌ వచ్చిందని వాదించారు. ‘నేను చదువుకోవడం వల్లనే నాకు ఫస్ట్‌ వచ్చింది’ అంటూ వాదించిన సాధ్వీ తనకు టీసీ ఇవ్వాలని, మరో స్కూల్లో చదువుకుంటానని ప్రిన్సిపల్‌ను కోరింది. అందుకు కూడా ప్రిన్సిపాల్‌ నిరాకరించడంతో ఆమె మూడేళ్లపాటు స్కూల్‌కే పోలేదు.

మాయావతిని కలుసుకున్న వేళ
1995లో మాయావతి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజాదర్బార్‌లో ఆమెను సాధ్వీ కలుసుకున్నారు. ఆ సందర్భంగా తన స్కూల్‌ విషయం చెప్పారు. మాయావతి సూచన మేరకు ఆమె జిల్లా కలెక్టర్‌ను కలుసుకొని స్కూల్‌ నుంచి టీసీ, సర్టిఫకేట్‌ తెప్పించుకున్నారు. మళ్లీ చదువు ప్రారంభించారు. ‘మాయావతి ముఖ్యమంత్రి అయినప్పుడు నేనెందుకు కాకూడదు!’ అని నాడే ఆమె అనుకున్నారట. అప్పుడు ఐదు నెలల కాలంలోనే మాయావతి ప్రభుత్వం రద్దయి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. అప్పటికే బీఎస్పీ సభ్యత్వం తీసుకున్న ఆమె లక్నోలో జరిగిన దళితుల ధర్నాలో పాల్గొన్నారు. ఆ ధర్నాపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. అప్పుడు ఓ బుల్లెట్‌ ఆమె కాలి పిక్కలోని దూసుకుపోయింది. దాంతో ఆమె ఆస్పత్రికి, అటు నుంచి జైలుకు వెళ్లారు. జైల్లో ఉండగానే తనకు మొగుడు, సంసార జీవితం అక్కరలేదని, బహుజన అభ్యున్నతి కోసం కృషి చేయాలని తనలో తాను ప్రతిజ్ఞ చేసుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఇంటి వాళ్లను ఒప్పించి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. దళితుల పక్షాన కృషి చేస్తూనే బీఏ వరకు చదువుకున్నారు.

2000లో బీఎస్పీ నుంచి సస్పెన్షన్‌
పార్టీ వైఖరిని విమర్శించడం వల్ల 2000 సంవత్సరంలో బీఎస్పీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. బీజేపీలో చేరారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2012లో పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో బహ్రాయిక్‌ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆమె బహుజనుల సమస్యలపైనే పార్టీలో, పార్టీ వెలుపల పోరాటం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు