ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం

9 Jul, 2018 11:02 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రామయ్య  

పోడు రైతులకు 2006 అటవీహక్కు చట్టాన్ని అమలు చేయాలి

ఏఐకేఎంఎస్‌ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య

ఖమ్మంమయూరిసెంటర్‌ : రాష్ట్రంలో జరుగుతున్న పోడు రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అఖిలభారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు.

ఆదివారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో అధికారం కోసం సీఎం కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చారన్నారు.

ప్రధానంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా మారిందన్నారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో పోడు రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నింటికి అటవీశాఖ అధికారులు, ప్రభుత్వం కారణమన్నారు.

2006 అటవీ హక్కు చట్టం కింద పోడు సాగుదారులు పొందిన భూమిని అధికారులు హరితహారం పేరుతో లాక్కుంటున్నారన్నారు. అటవీశాఖ అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో పోడు సాగు భూముల నుంచి ఆదివాసీలను కేసీఆర్‌ ప్రభుత్వం గెంటివేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఆదివాసీలు నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఆందోళనలు చేపడతామన్నారు. ఈ నెల 20న దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. 

మద్దతు ధర మహా మోసం.. 

ప్రధాని మోదీ ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తుల మద్ధతు ధర మహా మోసం అని ఆరోపించారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు తగ్గించి చూపించారని, వాటిని సాకుగా చూపించి ధరలు పెంచామని చెప్పడం ద్రోహం అన్నారు. ప్రకటించిన ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

వరి, గోధుమలతో పాటు ఇతర ధాన్యాలను కూడా ప్రభుత్వం సేకరించాలన్నారు. అక్టోబర్‌లో కొత్తగూడెంలో జాతీయ ఆదివాసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీల డిమాండ్లకు తాము మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్యం బాగలేని ఎన్డీ రాష్ట్ర నాయకుడు మధుని అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పెట్టడం దారుణమని, ఇటీవలే అరెస్ట్‌ అయి బెయిల్‌పై విడుదల అయిన మధు ఏ నేరం చేశారని ప్రశ్నించారు.  

సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కోటేశ్వరరావు, కెచ్చెల రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయల చంద్రశేఖర్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, చిన చింద్రన్న, ఆవుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు