ఇటలీ నుంచి ఇంకేదో కావాలేమో: పీయూష్‌

5 Mar, 2019 08:32 IST|Sakshi

సాక్షి, చెన్నై: భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌’పై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారికి భారత ఇంజనీర్ల ప్రతిభ నచ్చడంలేదని, ఇటలీ నుంచి  వారికి ఇంకా ఎదో కావాలని మండిపడ్డారు. దేశ శ్రామికులు, ఇంజనీర్ల కృషి ఫలితంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను రూపొందించడం వారు జీర్ణించుకులేకపోతున్నారని విమర్శించారు. భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించడమేనని గోయల్‌ అన్నారు. కార్మికులు అహోరాత్రులు కృషిచేసి ప్రతిష్టాత్మంగా రూపొందిన ట్రైన్‌ 18పై రాహుల్‌ విమర్శలు గుప్పించడం సిగ్గుచేటని మండిపడ్డారు. సోమవారం దక్షిణ తమినాడులో 1000 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును, 150 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను గోయల్‌ జాతికి అంకితం చేశారు. (‘వందే భారత్‌’ బ్రేక్‌ డౌన్‌!)

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాంలో గోయల్‌ మాట్లాడారు. దేశంలో అపారమైన ప్రతిభ కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల అనుభవంతో టెక్నాలజీని ఇతర దేశాలకు ఎగుమతి చేయలని భావిస్తున్నామని, కానీ ఇంటలీ నుంచి దిగుమతి చేసుకోవాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని వ్యంగ్యంగా విమర్శించారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించిన మరుసటి రోజే వారణాసి నుంచి ఢిల్లీకి తిరిగివస్తూ సాంకేతిక సమస్యలకు లోనవడంపై రాహుల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు రాహుల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాగా తమిళనాడులోని నైవేలిలోని విద్యుత్‌ ప్లాంట్‌ కార్మికుల శ్రమను గుర్తించిన కేంద్రమంత్రి నెలజీతంలో రూ.ఎనిమిదివేల  పెంచుతున్నట్లు ప్రకటించారు. శ్రామికుల కష్టాన్ని ఈ దేశం మర్చిపోదనన్నారు. 

మరిన్ని వార్తలు