ప్రచారానికి నేడే ఆఖరు

10 May, 2018 09:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

20 రోజులు మిన్నంటిన సందడి

సాక్షి, బెంగళూరు: ఉత్కంఠ భరితంగా సాగుతున్న కర్ణాటక ఎన్నికల పోరులో మరో ముఖ్య ఘట్టం ముగుస్తోంది. ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. రాష్ట్రంలోని 223 నియోజకవర్గాలకు ఈ నెల 12వ తేదీ ఎన్నికలు జరుగనున్నాయి. జయనగర ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బీకే విజయకుమార్‌ ఆకస్మిక మరణంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడడం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గత 20 రోజులుగా ప్రచారం హోరెత్తింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈ ఫలితాలు దిక్సూచి కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రాణం పెట్టి పోరాడుతున్నాయి. ఆయా పార్టీల అధినేతలు పోటాపోటీగా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. కన్నడ పోరు యావత్‌ భారత్‌ను ఆకర్షించింది. ఇప్పటివరకు వచ్చిన పలు సర్వేల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని చెబుతుండడంతో ప్రధాన పార్టీల్లో ఉలుకు మొదలుకాగా, కింగ్‌మేకర్‌ను అనుకుంటూ జేడీఎస్‌ లోలోన ఆనందిస్తోంది.

ముమ్మరంగా సందోహం
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ బెంగళూరులో రోడ్డు షోలు నిర్వహించారు. ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమిత్‌షా నెల రోజులుగా కర్ణాటకలోనే మకాం వేశారు. వీరికి తోడు స్థానిక నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్డూరప్ప, సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్‌ జి.పరమేశ్వర్, డీకే శివకుమార్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగించారు. ప్రస్తుతం మే నెల కావడంతో ఎండలు మండిపోతున్నాయి. అయినా కన్నడ నాట ప్రచారానికి నేతలు మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో మునిగితేలారు.

మెరిసిన తారలు
కన్నడ హీరోలు సుదీప్, యశ్, దర్శన్‌ పార్టీలకు కాకుండా అభ్యర్థులకు మద్దతుగా పలుచోట్ల రోడ్డు షోలు నిర్వహించారు. బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్‌ బీజేపీపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

ఆంక్షలు
పోలింగ్‌కు ఒకరోజు ముందుగానే బహిరంగ ప్రచారం ముగించాలి. గలాటా లేకుండా శుక్రవారం ఇంటింటి ప్రచారం మాత్రం చేసుకోవచ్చు. గురువారం సాయంత్రం నుంచి 12వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎలాంటి మీడియా, ప్రైవేటు సంస్థలు, సోషల్‌ మీడియాలు పోల్‌ సర్వేలను విడుదల చేయరాదు.

మరిన్ని వార్తలు