ఉద్ధవ్‌ నోటా అదే మాట!

25 Dec, 2018 03:53 IST|Sakshi

కాపలాదారే దొంగ అయ్యాడని మోదీపై విమర్శలు

పండరీపూర్‌(మహారాష్ట్ర): కాపలాదారే దొంగ అయ్యాడంటూ ప్రధాని మోదీని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తరచూ విమర్శించేవారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీతో కూటమిలో కొనసాగుతున్న శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే కూడా పరోక్షంగా మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవే మాటల్ని వాడారు. ఈ పరిస్థితుల్లో వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో శివసేన పొత్తు కొనడం కష్టమేనని పరిశీలకులు అంటున్నారు. సోమవారం సోలాపూర్‌ జిల్లా పండరీపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఉద్ధవ్‌ థాకరే ప్రసంగిస్తూ ఒక ఘటనను ఉదహరించారు. ‘ఇటీవలి రాష్ట్ర పర్యటనలో ఒక రైతు నాకు తెగులు సోకిన నిమ్మ చెట్టును చూపించారు. సాధారణంగా క్రిమి సంహారిణుల తయారీలో నిమ్మ చెట్టును వాడుతుంటారు.

అలాంటిది, ఇప్పుడు ఏకంగా నిమ్మ చెట్టుకే తెగులు సోకింది. దానిని గమనించి.. రోజులు మారాయి. కాపలా ఉండే వారే దొంగలుగా మారారు అని వారికి చెప్పా’అని అన్నారు. రఫేల్‌ విమానాల ఒప్పందంపై ప్రభుత్వంపై పలు ఆరోపణలు వచ్చాయి. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఆ ఒప్పందానికి క్లీన్‌చిట్‌ ఎలా ఇచ్చిందో నాకు తెలియదు’ అని అన్నారు. రఫేల్‌ ఒప్పందంలో ఏం జరిగిందో పంటల బీమా పథకంలోనూ అదే జరిగింది. రఫేల్‌ ఒప్పందంలో అవినీతి జరగలేదని కుంటే, ఇప్పటివరకు రైతులకు బీమా సొమ్ము ఎందుకు అందలేదు?’ అని ఆయన అన్నారు.  30 ఏళ్లుగా కోర్టులోనే నలుగుతున్న అయోధ్య అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. కాగా, థాకరే ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీని విమర్శించడం మాత్రం ఇదే ప్రథమం.

మరిన్ని వార్తలు