నూతన వ్యవసాయ పాలసీని వ్యతిరేకిస్తున్నాం: ఉత్తమ్‌

20 May, 2020 17:23 IST|Sakshi

 

 

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమగ్ర వ్యవసాయ విధానం లోపభూయిష్టంగా ఉందని నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై సమగ్రంగా సంప్రదింపులు జరపలేదని, ఈ ఖరీఫ్‌లో దీన్ని అమలు చేయవద్దని కోరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ చెప్పిన వ్యవసాయ విధానంపై ఈరోజు(బుధవారం) చర్చించినట్లు ఉత్తమ్‌ తెలిపారు. గాంధీభవన్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. రైతులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి కొత్త పాలసీ రూపొందించాలని డిమాండ్‌ చేశారు. నాలుగైదు రోజుల్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన పంట వేయాలనడం తుగ్లకు చర్య అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (‘పోతిరెడ్డిపాడు’ మీ ఇంటి సమస్య కాదు)

కేసీఆర్‌ చెబుతున్న నూతన వ్యవసాయ పాలసీని తాము వ్యతిరేకిస్తున్నామని ఉత్తమ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రైతులపై ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వమనడం రైతులను అవమానించడమే అవుతుందన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తాము పోరాటం చేస్తామని అన్నారు. దరిద్రపు టీఆర్‌ఎస్‌ పాలనలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాణీ ఎందుకు చేయలేదని, రైతు బంధు 40శాతం రైతులకు ఇంకా ఎందుకు అందలేదని ప్రశ్నించారు. (గుర్రాల నుంచే కోవిడ్‌ వ్యాక్సిన్‌ )

రైతులను మోసం చేస్తున్నారని, ధాన్యం కొనుగోలులో విఫలమైన కేసీఆర్‌ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పత్తి విత్తనాలు, కొనుగోలు, ధర ఏదీ తమ చేతిలో లేనప్పుడు పత్తి వేయాలని ఎందుకు చెబుతున్నారని కేసీఆర్‌ను నిలదీశారు. క్వింటాలుకు రూ.7వేలు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే పత్తి కొనేలా హామీ ఇ‍వ్వాని డిమాండ్‌ చేశారు. అప్పుడే పత్తి వేయాలని సూచనలు చేయాలని కోరారు. అలాగే మొక్కజొన్న రైతులపై ఆంక్షలు పెడితే ఊరుకోమని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. (మరో ప్యాకేజీ ఆశలు : భారీ లాభాలు )

మరిన్ని వార్తలు