‘ఆ సొమ్ముతో అద్భుతమైన రాజధాని’

16 May, 2018 16:00 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుని, విదేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దాచుకున్న రూ. మూడు లక్షల కోట్లను తిరిగి రాష్ట్ర ఖజానాలో జమ చేస్తే దాంతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. విదేశాల్లో చంద్రబాబు దాచుకున్న రాష్ట్ర సొమ్మును వెనక్కి తేవాలని కేంద్రాన్ని కోరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ సమస్యలను పార్టీ దృష్టికి తెస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులపై ప్రజలు తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురౌతున్నట్టు వెల్లడించారు.

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ లైంగిక దాడుల్లో భాగస్వాములవ్వడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలో రూ. మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నాలుగేళ్లు బీజేపీతో జతకట్టి ధనార్జనే ధ్యేయంగా పాలన సాగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చి బీజేపీతో తమ పార్టీ జతకట్టిందని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని స్పష్టం చేశారు.

రూ. మూడు లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు ఒక దొంగ అని, ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తి దొంగ కాక మరెమవుతారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడి, బీజేపీకి భయపడి, ప్రజలకు సాగిలపడి వేడుకునే పరిస్థితి చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ఇలాంటి అవినీతి, అక్రమ పాలనకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలంత ఎదురుచూస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంత సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నెల 16న విశాఖలో ధర్మ పోరాటం పేరిట దీక్ష చేయబోతున్న చంద్రబాబు ఎవరిపై పోరాటం చేస్తారో తెలపాలని డిమాండ్‌ చేశారు. బాబుది ధర్మపోరాటం కాదని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇతర పార్టీలపై నిందలు వేయడానికే సభలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో సభ నిర్వహించినా అధికార దుర్వినియోగం చేసి ప్రజలను తీసుకువస్తున్నారే తప్పా, స్వచ్ఛందంగా చంద్రబాబు సభలకు జనాలు వచ్చే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు