ప్రజల్ని మభ్యపెట్టేందుకే అన్న క్యాంటీన్లు

18 Jul, 2018 09:08 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

రైల్వేకోడూరు : నాలుగేళ్ల క్రితం ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో పేద ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పేద వాడికి బోజనం పెట్టే పథకంలో కూడా టీడీపీ నాయకులు కడుపు నిండా మెక్కుతున్నారని ఆరోపించారు. నాలుగేళ్లగా ప్రజలకు హామీలిస్తూ, దోచుకోవడానికి వీలుండే పనులే చేశారని, మాటల గారడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో అన్న క్యాంటీన్‌కు రూ.35లక్షలు వెచ్చించి, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని తెలిపారు. అయినా అక్కడికెళ్లిన పేదలకు అన్నం పెట్టకుండా దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

 
తిరుమలను భ్రష్టు పట్టిస్తున్న పాలకమండలి 
ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవసప్థానాన్ని టీడీపీ ప్రభుత్వంలోని పాలకమండలి భ్రష్టు పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. రోడ్లు, ఆలయం మూసివేత సంఘటనలు చరిత్రలోనే జరగలేదన్నారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి అసలు ఏమి చేయాలని ఆలోచిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. వీరబ్రహ్మేం ద్రస్వామి  చెప్పినట్లు తిరుమల ఆలయం మూత జరిగితే కలియుగాంతం అన్న మాటలు ప్రజలు గుర్తు చేసుకుంటూ భయభ్రాంతులకు గురవతున్నారని తెలిపారు.  వెంటనే పాలకమండలి నిర్ణయాన్ని వెనక్కితీసుకుని ప్రజలకు వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు, కార్యకర్తలు, నాయకులు గుండిమడుగు సుధాకర్‌ రాజు, సీహెచ్‌ రమేష్, మందల నాగేంద్ర, ఇనమాల మహేష్, ఆర్‌వీ రమణ, ఎంపీటీసీలు మందల శివయ్య, సుబ్రమణ్యం, సుదర్శన్‌రాజు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు