‘మేం డ్రామా కంపెనీ నడపటం లేదు’

6 Apr, 2018 11:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాలకు బయలుదేరేముందు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబులా తాము డ్రామా కంపెనీ నడపడం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తాము పోరాడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. హోదా కోసం ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన ఘనత వైఎస్సార్‌ సీపీ దని తెలిపారు. పబ్లిసిటీ, రాజకీయాల కోసమే చంద్రబాబు ఢిల్లీకి వచ్చారన్నారు. విభజన హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని సుబ్బారెడ్డి అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఎన్డీఏ 5 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు వస్తాయని, ప్రత్యేక హోదా కోసం ఉపఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

చంద్రబాబుది పూటకో మాట
రాష్ట్రానికి ఎవరు ద్రోహం చేశారో ప్రజల్లోకి తీసుకెళ్తామని మరో ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి తెలిపారు. పరిపాలకుడు సరైన పద్దతిలో ఉండాలని హితవు పలికారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. దేశానికి, రాష్ట్రానికి సరైన నాయకత్వం లేదని, పాలకులే మోసగాళ్లయితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడిగారు. చంద్రబాబు పూటకో మాట మార్చారని మండిపడ్డారు.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి
ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై 13వ సార్లు అవిశ్వాస నోటీసు ఇచ్చామని, వంద మందికి పైగా ఎంపీలు తమ పోరాటానికి మద్దతు తెలిపారని ఎంపీ వరప్రసాద్‌ రావు తెలిపారు. ఇప్పటికే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు కలిసి, చర్చకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీతో కలిసేందుకే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్రత్యేకహోదా కోసం  వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా పోరాడుతోందని, ఇదే విషయం చంద్రబాబుకు కూడా తెలుసునన్నారు. ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే బాబు రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారన్నారు. హోదా విషయంలో ప్రజలు తమని ఆదరిస్తున్నారనే.. చంద్రబాబు మాపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. 600 హామీల్లో ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబా తమకు నీతులు చేప్పేది.. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకుని ఎంపీలతో రాజీనామాలు చేయించి.. తమతో పాటు ఆమరణ దీక్షలో పాల్గొనాలన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ డ్రామాలు కట్టిపెట్టాలని అన్నారు. కలిసికట్టుగా పోరాడాలి.. ప్రత్యేక హోదా సాధించాలన్నారు. బీజేపీ దిగి రావాల్సిందే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. 

>
మరిన్ని వార్తలు