ఆమెను వేధించారో.. ఇక అంతే!

6 Oct, 2017 13:35 IST|Sakshi

సాక్షి :  అది ఆమ్‌స్టర్‌ డ్యామ్‌లోని ఓ వీధి. స్థానికంగా ఓ యూనివర్సిటీలో విద్యను అభ్యసించే 20 ఏళ్ల నోవా జన్స్‌మా నడుచుకుంటూ వెళ్తుంది. అంతలో పక్కనే కొందరు ఆకతాయిలు ఆమెను వెంబడిస్తూ మాటలతో వేధించటం మొదలుపెట్టారు. అంతే ఒక్కసారిగా వెనక్కి తిరిగిన ఆ యువతి వారి దగ్గరగా వెళ్లిన తన బ్యాగ్‌లో చెయ్యి పెట్టింది. ఏం తీయబోతుందా? అని ఆత్రుతగా చూస్తుండగా... యువకులు ఒక్కసారిగా నవ్వటం మొదలుపెట్టారు. 

ఆమె తన ఫోన్‌ను బయటకు తీసి వారితో ఓ సెల్ఫీ దిగింది. తనంతట తానుగా ఆ యువతి ఫోటో కోసం రావటంతో ఆకతాయిలు కూడా సరదాగా సెల్ఫీ దిగారు.  అయితే అది ఆమె వారికొచ్చే కాంప్లిమెంట్‌ అనుకుంటే పొరపాటే.  ఎందుకంటే ఆ ఫోటోల్లో ఆమె ముఖ కవలికలు మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాయి. అంటే ఆమె ఏదో చేయబోతుందని అర్థం. కానీ, తర్వాతే అసలు విషయం అందరికీ అర్థమైపోయింది. 

ఆ యువతి ఆ ఫోటోను డియర్‌క్యాట్‌కాలర్స్‌(వేధించే ఆకతాయిలు) యాష్‌ ట్యాగ్‌తో క్రియేట్‌ చేసిన ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తోంది. పైగా వాళ్లు చేసే కామెంట్లను కూడా అందులో పేర్కొంటుంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు...  నెల రోజుల వ్యవధిలో 24 ఫోటోలను ఆమె షేర్‌ చేసింది. అంటే అన్నిసార్లు ఆమె వేధింపులకు గురైందన్న మాట. తొలిసారి నోవా రైల్లో వెళ్తున్నప్పుడు కొందరు ఆమెను వేధించారు. అప్పుడే ఆమెకు ఈ ఆలోచన తట్టింది. తనకు ఎదురయ్యే వేధింపుల ద్వారానే అవగాహన కార్యక్రమం చేపట్టింది. తద్వారా వారు పరువు తీయటంతోపాటు.. మహిళలను గౌరవించాలనే సందేశం ఇస్తుందన్న మాట. 

ఇక ఈ వినూత్న నిరసనకు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది.  ఇప్పటిదాకా 45 వేల మంది ఆమెను ఫాలో అయ్యారు. ‘‘చట్టాలున్నా అవి వారిని ఆపలేకపోతున్నాయి. అందుకే ఇలాంటి నిరసన వ్యక్తం చేస్తున్నా. ఇది బాగా పని చేసింది. నాకిప్పుడు వేదింపులు తగ్గాయి’’ అని ఓ ఇంటర్వ్యూలో నోవా తెలిపింది. వేధింపులను ధైర్యంగా ఎదుర్కుంటూ నోవా చేసిన ప్రయత్నానికి మహిళా సంఘాలతోపాటు అభ్యుదయ వాదులు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు