పసందైన విందు

31 Dec, 2019 00:58 IST|Sakshi

 2019 అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో విశేషాలు

ఈ గడిచిన ఏడాదిలో క్రికెట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. చెలరేగిన ఆటగాళ్లు, పట్టాలెక్కిన పరుగు వీరులున్నారు. చెడుగుడు ఆడిన బౌలర్లున్నారు. చెరిగిన రికార్డులు కూడా ఉన్నాయి. ఎన్ని చెప్పుకున్నా...ఇందులో కొన్నయితే పదిలమైన ముద్ర వేసుకున్నాయి. వాటిని గుర్తుచేసుకుంటే మాత్రం... ప్రత్యేకించి క్రికెట్‌ ప్రియులకు కళ్లు మూసినా కనువిందే చేస్తాయి. మొత్తానికి 2019 సంవత్సరం క్రికెట్‌ ప్రేమికులకు పసందైన విందును అందించి వీడ్కోలు పలుకుతోంది.

సాక్షి క్రీడావిభాగం: పుట్టింటికి వెళ్లిన ప్రపంచకప్‌... భారత్‌లో పింక్‌బాల్‌ టెస్టు... ఓపెనింగ్‌లో రో‘హిట్స్‌’... బౌలింగ్‌లో దీపక్‌ చాహర్‌ చెడుగుడు... టి20 మెరుపులు చూసినోళ్లకు చూసినంత వేడుక చేసింది... క్రికెట్‌లో ఈ ఏడాది ఇవన్నీ అద్భుతాలేం కావు! కానీ... కొన్ని కోట్ల కళ్లను కట్టిపడేశాయి. తప్పతాగి జీరోగా మారిన వ్యక్తిని ఒక్క మ్యాచ్‌తో హీరోగా మార్చేశాయి. క్రికెట్‌ లోకానికి పసందైన విందును అందించాయి.

ఇంగ్లండ్‌దే వన్డే ప్రపంచం 
క్రికెట్‌ ఇంగ్లండ్‌లో పుట్టింది. కానీ పురుషుల జట్టు ఎప్పుడూ వన్డే ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేదు. ఆ లోటు తీరింది 2019లో అయితే తీర్చింది మాత్రం ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌! పురిటిగడ్డపై కొత్త చాంపియన్‌ కోసం జరిగిన పోరు ముందు ‘టై’ అయింది. తర్వాత ‘సూపర్‌ ఓవర్‌’ టై దాకా రసవత్తరం చేసింది. తద్వారా కనీవినీ ఎరుగని ఫైనల్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఏ ప్రపంచకప్‌ తుదిపోరు కూడా ఇలా ఇన్ని ‘టై’ మలుపులు తిరగలేదు. పరుగుల తేడాతోనూ, లేదంటే వికెట్ల తేడాతోనూ గెలిచిన విజేతలే ఉన్నాయి. కానీ మొట్టమొదటి సారిగా ఇటు వికెట్, అటు పరుగులు పైచేయి సాధించలేక... చివరకు ‘బౌండరీ కౌంట్‌’తో ఇంగ్లండ్‌ విజేత అయ్యింది.

ఇవన్నీ ఈ ఒక్క మ్యాచ్‌లోనే జరిగాయి. ఇక్కడ స్టోక్స్‌ (84) చేసిన పోరాటం అంతాఇంతా కాదు. అంతక్రితం తప్పతాగి రోడ్డుమీద తగువులాడి ‘జీరో’ అయిన స్టోక్స్‌ ఈ వీరోచిత పోరాటంతో ‘హీరో’ అయ్యాడు. అనంతరం ఈ బౌండరీల లెక్క పెద్ద చర్చకే దారి తీసింది. అలనాటి స్టార్లు మొదలు దిగ్గజాల వరకు అంతా ‘లెక్క’పై శ్రుతి కలిపారు. ఇది కొన్ని రోజులు, నెలల దాకా సాగడంతో చివరకు ఐసీసీ నిబంధనలు మార్చాల్సి వచ్చింది. మెగా ఈవెంట్‌ టైటిల్‌ పోరులో సూపర్‌ ఓవర్‌ కూడా ‘టై’ అయితే బౌండరీలను లెక్కపెట్టకుండా... పరుగులు పైచేయి సాధించేదాకా ‘సూపర్‌’ ఓవర్‌ను కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది.

పొట్టి క్రికెట్లో 4 రికార్డులకు ‘చెక్‌’

ఐసీసీ పుణ్యమాని చెక్‌ రిపబ్లిక్‌ కూడా అంతర్జాతీయ రికార్డు పుటలకెక్కింది. క్రికెట్‌కు విశ్వవ్యాప్త ఆదరణ తెచ్చేందుకని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పొట్టి ఫార్మాట్‌లో అసోసియేట్, అఫిలియేట్‌ దేశాల మధ్య జరిగే పోటీలకూ అంతర్జాతీయ హోదా ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 30న చెక్‌ రిపబ్లిక్, టర్కీ జట్ల మధ్య జరిగిన ఒక్క టి20ల్లోనే నాలుగు రికార్డులు చెదిరిపోయాయి. 278/4 స్కోరు చేసిన చెక్‌ 257 పరుగుల తేడాతో టర్కీని కంగుతినిపించింది. టర్కీ 21 పరుగులకే ఆలౌట్‌ కావడంతో అత్యల్ప స్కోరుకే ఆలౌట్‌ (నెదర్లాండ్స్‌ 39 ఆలౌట్‌), అత్యధిక పరుగుల తేడా (కెన్యాపై శ్రీలంక 172), అత్యధిక జట్టు స్కోరు... 35 బంతుల్లోనే చెక్‌ ఆటగాడు సుదేశ్‌ విక్రమశేఖర ‘శత’క్కొట్టడంతో (రోహిత్‌ శర్మ, మిల్లర్‌) ఫాస్టెస్ట్‌ సెంచరీల రికార్డు కనుమరుగయ్యాయి.

టెస్టు ‘క్లాసిక్స్‌’...

సంప్రదాయ ఆటలో ఈ ఏడాది రెండు సార్లు ‘ఆఖరి వికెట్‌’ హంగామా చేయడం విశేషం. ఏ పదో... పాతిక... కాదు ఏకంగా 70 పరుగుల పైచిలుకు భాగస్వామ్యంతో ఆయా జట్లను గెలిపించింది. ఫిబ్రవరిలో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 304 లక్ష్యంతో దిగిన శ్రీలంక 226/9 స్కోరుతో ఓడేందుకు సిద్ధమైంది. కానీ ఓడలేదు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విశ్వ ఫెర్నాండో (6 నాటౌట్‌)తో కలిసి కుశాల్‌ పెరీరా (153 నాటౌట్‌) అజేయమైన విజయ పోరాటం చేశాడు. ఆగస్టులో జరిగిన యాషెస్‌ సిరీస్‌లోనూ ఆసీస్‌పై ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ స్టోక్స్‌ (135 నాటౌట్‌) కూడా ఆఖరి వరుస బ్యాట్స్‌మన్‌ జాక్‌ లీచ్‌ (1 నాటౌట్‌)తో కలిసి అదే పోరాటం చేశాడు.

చాహర్‌ చెడుగుడు...
 
బంగ్లాదేశ్‌తో భారత్‌లో జరిగిన టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో దీపక్‌ చాహర్‌ చెడుగుడు ఆడేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చెరొటి నెగ్గడంతో ఆఖరి పోరు నిర్ణాయకమైంది. అంతకుముందెపుడు బంగ్లాతో పొట్టి సిరీస్‌ కోల్పోని రికార్డు భారత్‌ది. దీంతో కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ 174/5 స్కోరు చేస్తే... లక్ష్యఛేదనలో బంగ్లా ఓ దశలో 110/2 స్కోరుతో పటిష్టంగా కనపడింది. కానీ చాహర్‌ 3.2–0–7–6 బౌలింగ్‌ రికార్డుతో బంగ్లా చెల్లాచెదురైంది. ఇందులో అతని ‘హ్యాట్రిక్‌’ కూడా ఉండటం విశేషం. దీంతో బంగ్లా 144 పరుగులకే ఆలౌటైంది. సిరీస్, సిరీస్‌ ఓడిపోని రికార్డు భారత్‌ ఖాతాలో పదిలంగా ఉండిపోయింది. 

‘పేస్‌’ ఇయర్‌...

ఈ సంవత్సరం ‘పేస్‌’ పదునెక్కింది. వన్డేల్లో వివిధ జట్లకు చెందిన 29 మంది బౌలర్లు 20కి పైగా వికెట్లు తీశారు. అయితే ఇందులో ఐదుగురే స్పిన్నర్లున్నారు. అంటే సింహాభాగం (75 శాతం) ఫాస్ట్‌ బౌలర్లే. ఓవరాల్‌గా టాప్‌–5 బౌలర్లలో నంబర్‌వన్‌ బౌలర్‌ షమీ. అతను ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో 42 వికెట్లు తీశాడు. 38 వికెట్లతో బౌల్ట్‌ (కివీస్‌) రెండో స్థానంలో ఉండగా... తదుపరి స్థానాలు కూడా పేసర్లవే. ఫెర్గూసన్‌ (కివీస్‌), ముస్తఫిజుర్‌ (బంగ్లాదేశ్‌), భువనేశ్వర్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ భరతం పట్టారు. ఆసీస్‌ బౌలర్‌ స్టార్క్‌ కూడా విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రత్యేకించి వన్డే ప్రపంచకప్‌లో అతను 10 మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు తీశాడు.

పదేళ్ల తర్వాత...

సాధారణంగా క్రికెట్‌లో గాయపడిన ఆటగాళ్లు పునరాగమనం చేస్తారు. పాకిస్తాన్‌లో మాత్రం మరుగునపడిన టెస్టు క్రికెట్‌ పదేళ్ల తర్వాత లేచి వచ్చింది. శ్రీలంక టెస్టు సిరీస్‌ ఆడేందుకు వెళ్లడంతో పాక్‌లో మళ్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌ మొదలైంది. 2009లో లంకపైనే ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆగిపోయిన ఆటకు దశాబ్దం తర్వాత లంకనే ఊపిరి పోసింది.  

టెస్టుల్లో లబ్‌షేన్‌ తన బ్యాటింగ్‌ ప్రదర్శనతో ‘టాప్‌’ లేపాడు. 11 మ్యాచ్‌లే ఆడిన ఈ ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ 17 ఇన్నింగ్స్‌ల్లో 1,104 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు వరుస టెస్టుల్లో చేశాడు. మరో 7 అర్ధ సెంచరీలు కూడా బాదాడు. టెస్టుల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు దాటిన ఏకైక బ్యాట్స్‌మన్‌ లబ్‌షేన్‌ కావడం విశేషం. స్టీవ్‌ స్మిత్‌ (8 మ్యాచ్‌ల్లో 965 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు.

టెస్టుల్లో ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ ఏడాది ‘టాపర్‌’గా నిలిచాడు. అతను 12 టెస్టులు ఆడి 59 వికెట్లు తీశాడు. నాథన్‌ లయన్‌  (ఆస్ట్రేలియా– 45 వికెట్లు), స్టువర్ట్‌ బ్రాడ్‌ (ఇంగ్లండ్‌–43 వికెట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

వన్డేల్లో ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ జోరుపెంచాడు. 28 మ్యాచ్‌లాడిన ఈ ఓపెనర్‌ 27 ఇన్నింగ్స్‌ల్లో 1490 పరుగులు చేశాడు. 7 శతకాలు, అరడజను అర్ధ శతకాలున్నాయి. ఏడు శతకాల్లో ఐదు సెంచరీలను ఒక్క ప్రపంచకప్‌లోనే చేయడం విశేషం.

బెంగళూరులో జరిగిన టి20లో మ్యాక్స్‌వెల్‌ భారత శిబిరాన్ని వెలవెలబోయేలా చేశాడు. తొలుత కోహ్లి, ధోనిల స్ట్రోక్స్‌తో భారత్‌ 190/4 స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని మ్యాక్స్‌వెల్‌ (55 బంతుల్లో 113 నాటౌట్‌; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ 194/3 స్కోరు చేసి సులువుగా ఛేదించింది.

భారత్‌లో ఎట్టకేలకు డేనైట్‌ టెస్టు జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో ఫ్లడ్‌లైట్ల టెస్టు జరిగింది.

వీడ్కోలు వీరులు... 
ఈ ఏడాది పలువురు స్టార్‌ క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి హషీమ్‌ ఆమ్లా, ఇమ్రాన్‌ తాహిర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకోగా... డేల్‌ స్టెయిన్‌ టెస్టు ఫార్మాట్‌కు ‘టాటా’ చెప్పాడు. భారత స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ జూన్‌ నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు