‘క్రికెటర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే’

21 Sep, 2019 17:58 IST|Sakshi

ముంబై : ఈ మధ్య కాలంలో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అభిమానులు, అపరిచితులు మైదానాల్లోకి దూసుకవస్తుండటంపై  బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మొహాలి వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో అభిమానులు రెండు సార్లు మైదానంలోకి వచ్చి ఆటకు ఆటంకం కలిగించారని గుర్తుచేశారు. అయితే తమ అభిమాన ఆటగాళ్లపై ప్రేమ ఉండటం సహజమని కానీ ఇది సరైన పద్దతి కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక ఆటగాళ్లు హోటల్‌ నుంచి బయల్దేరిన మొదలు తిరిగి వారి గమ్యస్థానానికి చేరుకునేవరకు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ఆసోసియేషన్లే భద్రత కల్పించాలని స్పష్టం చేశాడు. ఈ మేరకు క్రికెట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అసోసియేషన్లకు అజిత్‌ సింగ్‌ లేఖ రాశాడు. 

‘ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 రద్దవడంతో టీమిండియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రెండో మ్యాచ్‌ కోసం మొహాలికి ముందుగానే చేరుకున్నారు. అయితే స్థానిక అసోసియేషన్‌తో ఉన్న సమస్యల కారణంగా క్రికెటర్లకు చండీగఢ్‌ పోలీసులు సెక్యూరిటీ కల్పించలేదు. దీంతో తొలి రోజు హోటల్‌ యాజమాన్యమే ఆటగాళ్లకు ప్రయివేట్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. రెండో రోజుకు గాని పోలీసులు ఆటగాళ్లకు భదత్ర కల్పించలేదు. ఇది చాలా విచారకరం. క్రికెటర్లకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత అసోసియేషన్లదే. అంతేకాకుండా మొహాలి మ్యాచ్‌లో మైదానంలోకి ఫ్యాన్స్‌ చొచ్చుకొచ్చారు. లాంగాఫ్‌, లాంగాన్‌, మిడాన్‌, మిడాఫ్‌, డీప్‌ థర్డ్‌మన్‌ వంటి ఫీల్డింగ్‌ పొజిషన్ల నుంచి బయటివాళ్లు మైదానంలోకి దూసుకొస్తున్నారు. దీంతో ఈ స్థానాల వద్ద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. మరోసారి మొహాలి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వహించాలి’అంటూ అజిత్‌ సింగ్‌ లేఖలో పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు