ఆంధ్ర ఘనవిజయం

15 Jan, 2020 03:46 IST|Sakshi

చెలరేగిన విజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌

సాక్షి, ఒంగోలు: తమ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర క్రికెట్‌ జట్టు మూడో విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్‌ 96 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 45/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ జట్టు 74.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటై ఓడి పోయింది. ఆంధ్ర పేస్‌ బౌలర్‌ పైడికాల్వ విజయ్‌ కుమార్‌ కేవలం 25 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి హైదరాబాద్‌ను హడలెత్తించాడు. మరో ఇద్దరు పేసర్లు యెర్రా పృథీ్వరాజ్‌ (3/53), శశికాంత్‌ (2/25) కూడా ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ జట్టులో టి.రవితేజ (144 బంతుల్లో 72 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటవ్వగా... ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 489 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. విజయ్‌ కుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇన్నింగ్స్‌ విజయం సాధించినందుకు ఆంధ్రకు బోనస్‌తో కలిపి ఏడు పాయింట్లు వచ్చాయి. దాంతో 18 జట్లున్న ఎలైట్‌ ‘ఎ అండ్‌ బి’ గ్రూప్‌లో ఆంధ్ర ప్రస్తుతం 21 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది. పంజాబ్‌ (18 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా... విదర్భ, కర్ణాటక 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. లీగ్‌ దశ ముగిశాక ఎలైట్‌ ‘ఎ అండ్‌ బి’ గ్రూప్‌లో టాప్‌–5లో ఉన్న జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 27 నుంచి కేరళతో ఆడుతుంది.

విజయ్‌ వీడ్కోలు...
ఈ మ్యాచ్‌తో ఆంధ్ర సీనియర్‌ పేస్‌ బౌలర్, 33 ఏళ్ల డేవిడ్‌  పైడికాల్వ  విజయ్‌ కుమార్‌ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2006లో బరోడాతో మ్యాచ్‌ ద్వారా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విజయ్‌... హైదరాబాద్‌తో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో 71 రంజీ మ్యాచ్‌లు ఆడిన విజయ్‌ మొత్తం 248 వికెట్లు తీశాడు. షాబుద్దీన్‌ (75 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్‌ బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌ ముగిశాక విజయ్‌ను ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) అధికారులు సన్మానించారు. సహచరులు బ్యాట్‌లు ఎత్తి ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’తో గౌరవించారు.   

మరిన్ని వార్తలు