ఆంధ్రకు మరో ఓటమి

1 Feb, 2017 00:20 IST|Sakshi

చెన్నై: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ సౌత్‌జోన్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. కర్ణాటకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులే చేసింది. కెప్టెన్‌ హనుమ విహారి (39 బంతుల్లో 55; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవితేజ (24 నాటౌట్‌; 3 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పవన్‌ దేశ్‌పాండే (51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, బండారు అయ్యప్ప, స్వరూప్‌ రెండేసి వికెట్లు తీశారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆంధ్ర ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడి, ఒక విజయం సాధించి నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు కేరళతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఐదు పరుగుల తేడాతో నెగ్గి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.

మరిన్ని వార్తలు