చండీలాకు మరో వారం గడువు

6 Mar, 2014 01:04 IST|Sakshi
చండీలాకు మరో వారం గడువు

ముంబై: ఐపీఎల్-6లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడిన రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అజిత్ చండీలా తన వివరణ ఇచ్చేందుకు బీసీసీఐ ఈ నెల 12 వరకు గడువిచ్చింది. జైలు నుంచి బెయిలుపై విడుదలైన చండీలా బుధవారం బోర్డు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యాడు.

ఈ సందర్భంగా తాను లిఖితపూర్వక వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలన్న చండీలా విన్నపాన్ని ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ మన్నించింది. గత ఏడాది ఐపీఎల్‌లో చండీలాతోపాటు భారత టెస్టు క్రికెటర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్, అమిత్‌సింగ్, సిద్ధార్థ్ త్రివేదిలు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రవి సవాని నేతృత్వంలోని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం నిర్ధారించిన సంగతి తెలిసిందే.

దీంతో శ్రీశాంత్, చవాన్‌లపై జీవితకాల నిషేధం, త్రివేదిపై ఏడాది, అమిత్‌సింగ్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధించిన బీసీసీఐ.. చండీలాపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాను నిర్దోషినని, ఎటువంటి తప్పూ చేయలేదని, తనకు అండగా నిలిచే వారెవరూ లేరని చండీలా వాపోయాడు. బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సివుందన్నాడు.
 

మరిన్ని వార్తలు