సాధారణం | Sakshi
Sakshi News home page

సాధారణం

Published Thu, Mar 6 2014 12:45 AM

Huge compition in elections

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సాధారణ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ నేతలు గెలుపు గుర్రాల ఎంపిక వేటలో పడ్డారు. ఇంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలకు షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో కలవరం మొదలైంది.
 
 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడడంతో ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పాటూ సాధారణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ,పార్లమెంట్‌లకు వరుసగా ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా  జిల్లాలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. ప్రధానంగా వెనుక బడిన వర్గాలకు బీసీ,ఎస్పీ కార్పొరేషన్లు,సెట్విజ్ వంటి శాఖల ద్వారా అమలు కావాల్సిన పథకాల మంజూరు నిలిచి పోనుంది. దీంతో  ఆయా వర్గాలకు నిరాశ తప్పదు.
 
 సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన....
 సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్రప్రధాన ఎన్నికల అధికా రి సంపత్‌కుమార్ బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. దీంతో జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీలతో పాటు సాధారణ ఎన్నిక లు నిర్వహించడానికి సన్నద్ధం కావాల్సి ఉంది.  మున్సిపల్ ఎన్నికలు ఈనెల 30న జరగనున్నాయి. అలాగే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న  రానుంది. ఆరోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. ఇప్పటి కే మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈకోడ్ కొనసాగనుంది. ఏప్రిల్ 12నుంచి 19వ తేదీలోగా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.21న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 23న నామినేషన్ల ఉపసంహరణ  ఉంటుంది. మే7న జి ల్లాలో ఉన్న 9 అసెంబ్లీ స్థానాలతో పాటూ  ఒక ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. మే16న ఫలితాలు వెలువడనున్నాయి.
 
 ఏర్పాట్లలో తలమునకలైన యంత్రాంగం
 వరుస ఎన్నికల నోటిఫికేషన్లు రావడంతో  యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో ఆ ఏర్పాట్లలో యం త్రాంగం తలమునకలైంది. మరో వైపు ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయడానికి అధికారులు సన్నద్ధమవుతుంటే కోడ్‌ను ఎలా పక్కదారి పట్టించాలనే యోచనతో రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. అధికార పార్టీ ప్రతినిధులు ఇప్పటికే పలు రకాలుగా జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న సంగతి విదితమే. రాష్ట్రపతి పాలన కావడంతో ఈసారి ఎన్నికల నిర్వహణ ఏవిధంగా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అధికార పార్టీ నేతలకు జిల్లా యంత్రాంగం దాసోహమైతే తీవ్రంగా ఎదిరిస్తామని ప్రతిపక్ష పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు.
 
 ఓటుహక్కు వినియోగానికి 21రకాల గుర్తింపు కార్డులు....
 ఇదిలా ఉండగా ఈఎన్నికల్లో  ఓటు వేసేందుకు 21రకాల గుర్తింపు కార్డులను అనుమతించేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఓటరుగుర్తింపు కార్డుతో పాటు ఆధార్,డ్రైవింగ్ లెసైన్స్,పాన్‌కార్డు,వికలాంగ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌పుస్తకం,ఉద్యోగి గుర్తింపు కార్డులు సైతం చూపించి ఓటు హక్కు వినియోగిం చుకోవచ్చునని ప్రకటించింది.
 
 బొత్సకు షాక్..
 పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎన్నికల సంఘం షాక్  ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలు,కార్పొరేషన్‌లు,నగర పంచాయతీలకు సంబంధించి వాటి పరిధిలోనే ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బొత్స లేఖ రాశారు. అయితే అలా కుదరదని రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ స్పష్టం చేశారు.
 
 నిలిచి పోనున్న అభివృద్ధి పనులు
 జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా ఎస్సీ,వెనుకబడిన వర్గాల వారు నష్టపోనున్నారు. ఎస్సీ,బీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులు, కులసంఘాలకు అందజేసే రుణాలకు సంబంధించిన లక్ష్యాలను  సర్కారు ఆలస్యంగా ఖరారు చేసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యూనిట్ల లక్ష్యాన్ని పెంచినప్పటికీ పలు నిబంధనలు విధించడంతో పాటు ఎన్నికల దగ్గ ర అయితే డబ్బులు మంజూరు కాకపోయినా కోడ్ నెపంగా చెప్పుకోవచ్చునన్న భావనతో యూనిట్ల లక్ష్యాన్ని జనవరిలో ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో కనీసం సగం  యూనిట్లు కూడా మంజూరయ్యే పరిస్థితి లేదు. దీంతో ఆయా వర్గాల  నిరుద్యోగ యువకులు,సంఘాల ఆశలు అడియాసలే కానున్నాయి.
 
 మురిగిపోనున్న నిధులు
 ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు మురిగిపోనున్నాయి. దీంతో గ్రామాల్లో మౌలి క సదుపాయాల కల్పన ఆగిపోనుంది. ఇన్‌చార్జ్ మంత్రి కోటాలో ఏడాదికి రూ 5.5 కోట్లు, ఎమ్మెల్యేల నిధుల కింద రూ.5.5 కోట్లు మంజూరవుతాయి. దీనికి సంబంధించి 2010-11 సంవత్సరంలో రూ.3లక్షలు,2011-12 సంవత్సరంలో రూ.6.4లక్షలు,2012-13 సంవత్సరానికి సంబంధించి రూ.3.7లక్షలు మిగిలిపోయాయి. అలాగే 2013-14 సంవ త్సరానికి సంబంధించి సీడీపీ కింద రూ.2.75కోట్లు ఇన్‌చార్జ్ మంత్రి కోటా కింద రూ.2.75 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రూ.64లక్షలు ఇంకా ఖర్చు కావాల్సి ఉం ది. అలాగే మరో రూ.5కోట్లు విడుదల కావు. దీంతో జిల్లా ప్రజలు అవస్థలు పడక తప్పదు మరి.
 
 16.86లక్షల మందికి ఓటు హక్కు
 2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 16 లక్షల 21వేల147 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 16లక్షల86వేల 19మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 ఈ సారి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 8,31,743మంది కాగా స్త్రీలు 8,54.170మంది ఇతర ఓటర్లు 106 మంది ఉన్నారు.
 

Advertisement
Advertisement