ఆ జ్ఞాపకాలతో బర్త్ డే చేసుకో: సెహ్వాగ్

30 Dec, 2016 12:01 IST|Sakshi
ఆ జ్ఞాపకాలతో బర్త్ డే చేసుకో: సెహ్వాగ్

ఢిల్లీ: తన క్రికెట్ కెరీర్లో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్..ఇప్పుడు ట్వీట్లతో కూడా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే ఎన్నో ట్వీట్లతో ప్రత్యేకమైన శైలిని సృష్టించుకుని 'ట్విట్టర్ కింగ్' గా పిలిపించుకుంటున్న సెహ్వాగ్.. తాజాగా పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ను సరదాగా ఆట పట్టించే యత్నం చేశాడు. డిసెంబర్ 29వ  తేదీన 41వ ఒడిలోకి అడుగుపెట్టిన ముస్తాక్కు సెహ్వాగ్ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలియజేసి మరొకసారి ఆకట్టుకున్నాడు.

 

2009, మార్చి 29వ తేదీన ముల్తాన్లో పాకిస్తాన్పై సెహ్వాగ్ సాధించిన ట్రిపుల్ సెంచరీని ఇక్కడ సెహ్వాగ్ ప్రస్తావించాడు. ఆ సమయంలో ముస్తాక్ బౌలింగ్లో సిక్స్ కొట్టి ట్రిపుల్ ను పూర్తి చేసుకున్న వీడియోను సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. ఈ వీడియో లూప్ను చూస్తూ బర్త్ డేను ఎంజాయ్ చేయమంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 'ప్రియమైన ముస్తాక్కు ఇవే నా బర్త్ డే శుభాకాంక్షలు. ఆనాటి మన జ్ఞాపకాలను ఎంజాయ్ చేస్తూ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకో. ఆ జ్ఞాపకాలే  నా ఆశీర్వాదాలు' అంటూ  సెహ్వాగ్ ట్వీట్లో పేర్కొన్నాడు. మరొకవైపు ఈ బర్త్ డే విషెస్ను ఎవరూ అధిగమించలేరంటూ సెహ్వాగ్ చమత్కరించాడు.