అశ్విన్‌కు ఉద్వాసన తప్పదా?

25 Aug, 2019 13:16 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఒకప్పుడు భారత క్రికెట్‌ జట్టులో టాప్‌ స్పిన్నర్‌గా వెలుగొందిన రవి చంద్రన్‌ అశ్విన్‌ పరిస్థితి ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది.  గత కొంతకాలంగా టెస్టు ఫార్మాట్‌కే పరిమితం అయిపోయిన అశ్విన్‌.. అక్కడ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోవడంలో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాడు. ప్రధానంగా కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌ వంటి యువ స్పిన్నర్లు భారత జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లుగా మారిపోవడంతో అశ్విన్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.  ఇదిలా ఉంచితే, రాబోవు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో అశ్విన్‌ను కింగ్స్‌ పంజాబ్‌ జట్టు కెప్టెన్సీ పగ్గాల నుంచి తప్పించాలని చూస్తోంది.

గత రెండు సీజన్లలో కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా ఉన్న అశ్విన్‌.. పూర్తిగా విఫలం కావడం అందుకు కారణంగా కనిపిస్తోంది. జట్టును ముందుండి నడిపించడంలో వైఫల్యం చెందడంతో పాటు స్పిన్నర్‌గా కూడా పెద్దగా రాణించలేదు. దాంతో అశ్విన్‌కు గుడ్‌ బై చెప్పాలనే యోచనలో కింగ్స్‌ పంజాబ్‌ యాజమాన్యం ఉంది. అదే సమయంలో ఆటగాడిగా కూడా అశ్విన్‌ను వదులుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ వారాంతంలో సమావేశమైన కింగ్స్‌ పంజాబ్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు అశ్విన్‌ కెప్టెన్సీపై సుదీర్ఘంగా చర్చించారట. ఆటగాడిగా కూడా రిలీజ్‌ చేయాలని కొందరు పెద్దలు సూచించడంతో అశ్విన్‌కు ఉద్వాసన తప్పకపోవచ్చు.

2018 ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా అశ్విన్‌ను రూ.7 కోట్లకు పైగా వెచ్చించి కింగ్స్‌ పంజాబ్‌ తీసుకుంది. అయితే కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. కింగ్స్‌ పంజాబ్‌ తరఫున 28 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 25 వికెట్లే తీశాడు. ఓవరాల్‌గా 139 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ ఖాతాలో 125 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయితే కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను నియమిస్తారనే వాదన ఉంది. వచ్చే సీజన్‌లో పంజాబ్‌ జట్టుకు రాహుల్‌కు సారథ్య పగ్గాలు అప్పచెప్పాలని చూస్తున్నారు.

ఇటీవల కింగ్స్‌ పంజాబ్‌ ప్రధాన కోచ్‌ పదవికి మైక్‌ హెసన్‌ గుడ్‌ బై చెప్పిన నేపథ్యంలో కోచ్‌ అన్వేషణలో పడ్డారు. ఆ క్రమంలోనే సమావేశం జరగ్గా, కెప్టెన్సీ మార్పుపై కూడా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ అశ్విన్‌ను కింగ్స్‌ పంజాబ్‌ వదులుకుంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకునే అవకాశం ఉందని మిర్రర్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అశ్విన్‌ కోసం ఢిల్లీతో పాటు రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా పోటీ పడే అవకాశం ఉన్నట్లు అందులో పేర్కొంది.

మరిన్ని వార్తలు