'కోహ్లి వల్లే నా పదవి పీకేశారు'

8 Mar, 2018 17:05 IST|Sakshi

బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ:‍దాదాపు పదేళ్ల క్రితం​ విరాట్‌ కోహ్లిని భారత జట్టులో ఎంపిక చేయడం వల్ల తన చీఫ్‌ సెలక్టర్‌ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ భారత దిగ్గజ ఆటగాడు దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్‌ కోహ్లిని ఎంపిక చేయడమనేది బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అప్పటి బీసీసీఐ కోశాధికారిగా ఉన్న ఎన్‌ శ్రీనివాసన్‌కు నచ్చని కారణంగానే చీఫ్‌ సెలక్టర్‌ పదవిని కోల్పోవల్సి వచ్చిందని తాజాగా స్పష్టం చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో తమిళనాడు ఆటగాడు ఎస్‌ బద్రీనాథ్‌ను తప్పించి కోహ్లిని ఎంపిక చేయడంతో శ్రీనివాసన్‌ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నాడు.

'2008లో జరిగిన అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ను కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు గెలుచుకుంది. ఆ క‍్రమంలోనే ముందుగా ఆ ఏడాది శ్రీలంక పర్యటనకు కోహ్లిని భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టులోకి తీసుకున్నాం. అదే సమయంలో బద్రీనాథ్‌ కూడా వన్డే అరంగేట్రం చేశాడు. లంకేయులతో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో బద్రీనాథ్‌ను అరంగేట్రం జరిగింది. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన బద్రీనాథ్‌ (27 నాటౌట్‌, 6, 6) తీవ్రంగా నిరాశపరిచాడు. అదే సిరీస్‌లో కోహ్లి ఐదు మ్యాచ్‌లు ఆడాడు. తొలి మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన కోహ్లి.. రెండో వన్డేలో 37 పరుగులు చేశాడు. ఇక మూడో వన్డేలో 25 పరుగులు చేయగా, నాల్గో వన్డేలో 54 పరుగులు, ఐదో వన్డేలో 31 పరుగులు చేశాడు. దాంతో ఆపై ఆసీస్‌ పర్యటనకు బద్రీనాథ్‌ను పక్కకు పెట్టి కోహ్లిని ప్రాముఖ్యత నిచ్చాం​. ఇది నా చీఫ్‌ సెలక్టర్‌ పదవికి ఎసరు పెట్టింది. బద్రీనాథ్‌పై ఎందుకు వేటు వేయాల్సి వచ్చిందంటూ శ్రీని నన్ను ప్రశ్నించారు. దానికి నేను విరాట్‌ను వెనుకేసుకొచ్చా.

విరాట్‌లో ఒక అసాధారణ ఆటగాడ్ని నేను చూశా. అందుకే అతన్ని ఆసీస్‌ టూర్‌కు ఎంపిక చేయడానికి కారణమని చెప్పా. దాంతో నాకు, శ్రీనికి వాగ్వాదం జరిగింది. ఆ సీజన్‌లో తమిళనాడు తరపున 800 పరుగులు చేసిన ఆటగాడ్ని ఎలా తప్పిస్తారు అని ప్రశ్నించారు. అతనికి మరొక చాన్స్‌ ఇద్దామని శ్రీనికి నేను సర్దిచెప్పే యత్నం చేశా. ఇంకా ఎప్పుడు చాన్స్‌ ఇస్తావు. అతనికి ఇప్పటికే 29 ఏళ్లు అని నిలదీశారు. దానికి నేను చాన్స్‌ ఇద్దామని చెప్పాను కానీ, ఎప్పుడు అనేది చెప్పలేకపోయా. ఆ మరుసటి రోజు నా చీఫ్ సెలక్టర్‌ పదవి ముగిసిపోయిందని చెప్పారు. కృష్టమాచారి శ్రీకాంత్‌కు సెలక్షన​ కమిటీ చీఫ్‌ బాధ్యతలు అప్పచెప్పారు. అయితే శరద్‌ పవార్‌ బీసీసీఐ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత నాకు మళ్లీ సెలక్షన్‌ కమిటీలో చోటు దక్కింది' అని వెంగీ తెలిపారు. 2006లో తొలిసారి దిలీప్‌ వెంగసర్కార్‌ బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ సెలక్టర్‌ బాధ్యతలు చేపట్టారు. భారత మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరే నుంచి వెంగీసర్కార్‌ ఆ పదవిని స్వీకరించిన వెంగీ.. రెండేళ్ల తర్వాత ఆ పదవికి ఉన్నపళంగా గుడ్‌ బై చెప్పారు. ఆపై 2011లో తిరిగి మరోసారి బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా వెంగ్‌ సర్కార్‌ ఎంపికయ్యారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ మద్దతుతో వెంగీ మరోసారి సెలక్షన్‌ కమిటీ బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని వార్తలు