'చంద్రబాబు గొప్పల వల్లే ఈ తిప్పలు' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు గొప్పల వల్లే ఈ తిప్పలు'

Published Thu, Mar 8 2018 5:10 PM

YSRCP MLA Gadikota Srikanth Reddy Fire On ChandraBabu - Sakshi

సాక్షి, కడప: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన గొప్పల వల్ల ఏపీకి తిప్పలు తప్పవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హోదా అడగనందునే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఇన్నాళ్లు నాన్చిందని, మొదట్నుంచీ ఒత్తిడి పెంచుంటే పరిస్థితి మరోలా ఉండేదని శ్రీకాంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో ఆయన గురువారం మీడియాతో పలు విషయాలు ప్రస్తావించారు. రాజధాని అంటూ ఎన్నో గొప్పలు చంద్రబాబు చెప్పారు. కానీ ఈ నాలుగేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత ఇటుకైనా పడిందా అని ప్రశ్నించారు. 

బడ్జెట్‌లో అన్నీ తప్పుడు లెక్కలే
బడ్జెట్ అంటే అన్ని వర్గాలు తమ మేలు కోసం ఎదురు చూస్తుంటారు. కానీ నాలుగేళ్లుగా టీడీపీ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదన్నారు. అంకెల గారడి తప్ప ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి చంద్రబాబు సర్కార్‌కు లేదని విమర్శించారు. బడ్జెట్‌లో అన్నీ తప్పుడు లెక్కలేనని.. గత ఏడాది రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్ ఒక్కసారిగా రూ. 1.91 లక్షల కోట్లకు చేరిందో అర్థం కావడం లేదన్నారు. రెవెన్యూ లోటు గతేడాది రూ.17 వేల కోట్లు ఉండగా ఈ ఏడాది రూ.4 వేల కోట్లకు ఎలా వచ్చింది. ఈ ఏడాది రూ.5 వేల కోట్లు మిగులుతుందని ఏ విధంగా చెబుతారు. ఏ రకంగా ఆదాయం పెరిగిందో టీడీపీ సర్కార్‌ సమాధానం చెప్పాలి. రెండంకెల వృద్ధి సాధించామని చెప్పడం వల్లే కేంద్ర సాయం చేయడం లేదని తెలుస్తుందన్నారు.

'పట్టిసీమ వల్ల సీమ సస్యశ్యామలం అని చెప్పారు. కానీ 17 లోల ఎకరాల్లో సాగు తగ్గిపోయిన విషయం నిజం కాదా. వ్యవసాయంలో 40 శాతం వృద్ధి అని సర్కార్ ప్రచారం చేస్తోంది. కానీ ఏ విధంగా అంటే మాత్రం చెప్పడం లేదు. టీడీపీ అధికారంలోకొచ్చిన ఈ నాలుగేళ్లలో రూ.12 వేలకోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. బీసీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులు టీడీపీ సర్కార్ ఖర్చుచేయలేదంటూ' శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ చేస్తారా అని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం లేదు అని సమాధానమిస్తోందన్నారు. విభజన హామీలు అమలు అవకపోవడానికి, హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చత్తీస్‌ఘఢ్‌ ప్రభుత్వం రూ. 4000 కోట్లతో నయా రాయపూర్ రాజధాని నిర్మించారు.. కానీ ఏపీలో ఎన్నికోట్లు ఖర్చు చేసినా రాజధానిలో ఒక్క ఇటుక కూడా పడలేదని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి వివరించారు.

Advertisement
Advertisement